ద్వంద్వ ప్రవృత్తి (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(జనవరి 2025 రవళి సంక్రాంతి సంచికలో ప్రచురితం )
"ఏమిటి నాన్న ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావు రెండు రోజులనుండి ?. నాకు ఈ రోజు కొద్దిగా ఖాళీ దొరికింది. అమ్మ కూడా ఇక్కడే ఉంది. నీ మనసులో ఉన్నది ఏమిటో చెప్పు. నేను ఏమీ అనుకోనులే " అన్నాడు శ్రీకాంత్. తండ్రి ఏమి చెప్పబోతున్నాడో నని ఉత్కంఠతతో చూడ సాగాడు.
"అబ్బే అటువంటిది ఏమీ కాదులేరా . ఈ రోజు ఒక టీవీ సీరియల్ చూస్తూంటే నాకు ఎందుకో అనిపించింది . అందులో లాగా నేను ఉండకూడదని అనుకుంటున్నాను. ఇప్పుడు నా వయసు డబ్బై పైనే ఉన్నాయి. అన్ని బాధ్యతలు తీరిపోయాయి. ఖర్మ కాలి నాకు ఏమైనా అయ్యిందనుకో. మీరంతా కంగారు పడిపోయి నన్ను ఆసుపత్రుల వెంట తిప్పి అనవసరంగా డబ్బు తగలేసుకోవద్దని చెప్పాలని నా తాపత్రయం. "అన్నాడు ఈశ్వర రావు . అలా అంటూ ఉంటే ఆయనలో సన్నటి కన్నీటి పొర అడ్డుపడింది. .
" ఏమిటండీ మీరు? అవన్నీ ఇప్పుడు ఎందుకు ? మన వంశంలో వాళ్ళందరూ తొంబై ఏళ్ళకు పైగానే బ్రతికారు. మీరూ అంతే. వాళ్ళందరూ కూడా చివరి క్షణంలో ఇంకా బ్రతకాలని కోరుకున్న వాళ్లేట. ఎవరైనా బలవన్మరణం పొందాలని అనుకుంటారా ? అంత అవసరమైతే ప్రతి కుటుంబంలోని వాళ్ళు పెద్ద వాళ్ళని బ్రతికుంచుకోవాలనే చూస్తారు. ఇప్పటినుండి ఇటువంటి అపశకునపు మాటలు మాట్లాడకండి బాబూ ": అంటూ ఈశ్వర రావు భార్య రాజేశ్వరి అతని నోటికి తాళం వెయ్యబోయింది.
"అది కాదోయ్ . నా ఆవేదన నీకు అర్ధం కాలేదు. ఇక ఆ వయసులో వాళ్ళను బ్రతికించాలని చూడటం శుద్ద దండగ. కరోనా సమయంలో చూడు కోటేశ్వరులు కూడా ఆసుపత్రుల పాలయ్యి చివరకు ఐసియ్యూలలో తనువులు చాలించారు. చివరకు ఏమయ్యింది చాలా మంది ఇంట్లో వాళ్ళను బిచ్చగాళ్లుగా మార్చేశారు. కొన్ని రోగాలు వచ్చాయంటే అవి తగ్గేవి కావు. డాక్టర్లు, మందుల షాపు వాళ్ళు బ్రతకడానికి అలా రోజులు లాగిస్తూ ఉంటారు. " అన్నాడు ఈశ్వర రావు వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ.
తండ్రి అలా మర్మగర్భంగా మాట్లాడుతూ ఉంటే శ్రీకాంత్ లో ఎప్పుడూలేని ఏదో అవ్యక్తమైన ఉద్విగ్నత ఆవరించింది.. గట్టిగా ఒకసారి ఊపిరి తీసుకుని వదిలేశాడు. . .
ఈ మధ్య కాలంలో తండ్రి రెండు మూడు సార్లు తన గురించి అదే విషయాన్ని పదే పదే వ్యక్తపరుస్తున్నాడు. ఆయనకే బాధలు ఉన్నాయో ఎవరికీ చెప్పుకోవడం లేదు. కానీ ఏవేవో మందులు మాత్రం ఆన్లైన్లో తెప్పించుకుని వాడుతున్నాడు.
ఆ రోజు ఈశ్వర రావుకు బీపీ ఎక్కువయ్యింది. భార్య బలవంతమ్మీద టెస్ట్ చేసి చూసుకుంటే అబ్నార్మల్గా అనిపించింది. అదే విషయాన్ని రాజేశ్వరి కొడుక్కి ఫోన్ చేసి , ఈ మధ్య మీ నాన్న అనవసరమైన ప్రతి విషయానికీ ఆందోళన పడుతున్నారని, తనకు కూడా చెప్పకుండా ఏవేవో మందులు మింగుతున్నాడని, ఒకసారి మంచి ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ సలహా తీసుకుంటే బాగుంటుందేమో ..." అంటూ అతన్ని అలెర్ట్ చేసింది.
"వాడు సాయంత్రం త్వరగా వచ్చి మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళతాడుట ...రెడీగా ఉండమంటున్నాడు .." అంది రాజేశ్వరి భర్తతో ...
ఈశ్వరరావు మొహంలో రంగులు మారాయి. .
" నీకు ఎన్ని సార్లు చెప్పాలి ? నువ్వు కంగారు పడేదే కాకుండా ఆఫీసులో బిజీగా పనిచేసుకుంటున్న వాడిని కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు ? ఇంట్లో ఏవో మందులు వాడుతున్నాగా . ఇప్పుడు ఆసుపత్రికి వెళ్లామంటే వాళ్ళు ఏదేదో చెపుతారు. ఇంకా పవర్ఫుల్ మందులు వాడమంటారు. ఇప్పుడు అయ్యే బడ్జెట్ రెట్టింపు అవ్వడం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు....ఒక్కోసారి బీపీ అలా పెరుగుతూ ఉంటుందని, దానికి ప్రత్యేక కారణాలు అంటూ ఉండవు అని టీవీలో డాక్టర్లు చెపుతూనే ఉన్నారుగా. నా ప్రకారం ఈ రోజు ప్రోగ్రాం అవాయిడ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ రోజంతా చూద్దాం. అంతగా ఒకవేళ తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాం .. " అంటూ దాటవేయ్యాలని ప్రయత్నం చేశాడు ఈశ్వర రావు.
అనుకున్నప్రకారం శ్రీకాంత్ ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుండి త్వరగా వచ్చేశాడు. ఇంట్లో లుంగీ, బనీనుతో ఉండి టీవీ చూసుకుంటున్న తండ్రిని చూసి " నువ్వింకా తయారవ్వలేదేమిటి నాన్నా ? నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను. మనం ఇంకో గంటలో ఆస్పత్రి దగ్గర ఉండాలి. వెంటనే రెడీ అవ్వు. ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఈసీజీ తీసి వేరే మందులు మారుస్తారు అంతే .".అంటూ తల్లి వైపు చూసి" నువ్వు నాన్న పక్కన ఉంటే ఆయనకు కొద్దిగా ధైర్యంగా ఉంటుంది. ..నీకు డాక్టర్లు అంటే భయం లేదుగా. ఎటువంటి టెస్టులైనా నవ్వుతూ చేయించేసుకుని వచ్చేస్తూ ఉంటావు. ఐదు నిమిషాల్లో నువ్వు కూడా రెడీ కా .. టైమ్ అయిపోతోంది .." అన్నాడు శ్రీకాంత్ తొందరపెడుతూ.
" నేనెందుకు లేరా ? అక్కడ మళ్ళీ నా పైన మాటికి మాటికీ విసుక్కుంటూ మరింత బీపీ పెంచుకుంటారు. ఆ రీడింగ్ చూసి డాక్టర్లు ఈయన్ని మరింత భయపెడతారు. ఈ సారికి మీ ఇద్దరూ వెళ్ళి రండి. నాకు తెలుసు . ఆయనది టెన్షన్ బీపీనే. రోగం కాదు. నువ్వు చెప్పినట్టు మహా అయితే మందులు మారుస్తారు. నా మాట విని ఇద్దరూ వెళ్ళి రండి ..." అంటూ రాజేశ్వరి కూర్చున్న చోటనుండి లేచే ప్రయత్నం కూడా చేయలేదు.
మొత్తానికి శ్రీకాంత్ రానని మొరాయించిన తండ్రిని మాత్రం బలవంతాన కారులో ఎక్కించుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు.
"ఏమిటి నాన్నా ఈసీజీ చాలా అస్తవ్యస్తంగా ఉంది? హార్ట్ బీటింగ్ ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంది. నాకేమీ లేదంటూ ఏం జరిగితే అది జరుగుతుందని ఇలా మునగదీసుకుని కూర్చూంటే ఎంత ప్రమాదమో తెలుసా ? నాకు తెలియక అడుగుతాను. ఇంట్లో నీకు టెన్షన్లు ఏమీ ఉన్నాయి ? అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతున్నాయి కదా. ఆ భగవంతుని దయవల్ల ఆర్ధిక సమస్యలు లేవు. ఎవరితోనూ గొడవులు కూడా లేవు. మరి ఈసీజీ ఇలా ఎందుకు ఉందో అర్ధం కావడం లేదు .." అంటూ డాక్టర్ గారి రూమ్లోకి దారితీశాడు.
డాక్టర్ గారు ఈశ్వర రావు ఈసీజీ చూసి పల్స్ పట్టుకుని చూశాడు.
"రెగ్యులర్గా బీపీ రికార్డు చేస్తున్నారా ? ఇప్పుడైతే చాలా ఎక్కువగానే ఉంది. పల్స్ రేట్ కూడా కంట్రోల్లో లేదు. ఎందుకైనా మంచిది ఒకసారి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించండి వెంటనే. దాన్ని బట్టే మందులు వాడాల్సి వుంటుంది. ఇప్పుడు వాడే మెడికేషన్ ఈయనకు సరిపోదు ...అంటూ కిడ్నీ టెస్ట్ కు ప్రిస్క్రిప్షన్ వ్రాసి ఇచ్చాడు డాక్టర్ .
"తప్పదు నాన్నా. అంత హై బీపీ కంట్రోల్లో లేకుండా ఉందంటే వాళ్ళకు కిడ్నీ టెస్ట్ లోనే కారణాలు బయట పడతాయి. ఈయన పెద్ద డాక్టర్ కాబట్టి అంతా స్టడీ చేస్తే కానీ ఏ మందులు ఇవ్వడు. .. టెస్ట్ ఇవాళ కాకపోయినా ఒక రెండు రోజులలోనైనా తప్పకుండా చేయించుకోవాలి .." అన్నాడు శ్రీకాంత్ వెను తిరుగుతూ. .
"ఏమిటిరా ఇదంతా ? ఇప్పుడు ఇంతటితో ఆగుతుందా ? కొంపదీసి అందులో పాజిటివ్ వచ్చి ఏ క్రియాటినిన్ ఏ మూడో నాలుగో ఉంటే ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ డయాలిసిస్ చేయించుకోవడం నా వల్ల కాదురా . కొన్నాళ్లు ఇది పెండింగ్ పెట్టు. కాస్త ఉప్పూ అవి బాగా తగ్గించి, టీవీలలో రాజకీయాల డిబేట్లు చూడటం పూర్తిగా పక్కన పెట్టేసి బీపీని తగ్గించుకునే మార్గాలు చూస్తాను. మన చుట్టాలలో ఒకావిడకు ఇదే సమస్యతో రెండు మూడు రోజులకు ఒకసారి ఈ డయాలిసిస్ చేయించలేక ఆమె మొగుడు ఆర్ధికంగా ఎంతో చితికిపోతూ ఉంటే , మరోపక్క ఆవిడ రోజూ జీవన మరణ సమస్యగా జీవితం వెళ్లబోస్తోంది. ...ముందు నన్ను ఇక్కడనుండి ఇంటికి తీసుకెళ్లు. ఇంటి మొహం చూసి ఎన్నాళ్ళో అయినట్టుంది. ...." అంటూ శ్రీకాంత్ తండ్రి ఇంకా కిడ్నీస్ టెస్ట్ చేయించకుండానే ముందుగానే విపరీతంగా ఆందోళన పడిపోసాగాడు.
తండ్రి పరిస్తితి చూసి శ్రీకాంత్ మొహం గంభీరంగా మారిపోయింది.
" అవన్నీ ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తావ్ నాన్నా ? ఆరోగ్యం విషయంలో ఎలాంటి విషమ పరిస్తితులు వచ్చినా ఇప్పుడు అన్నిటికీ పవర్ఫుల్ మందులు వచ్చాయి. వాటితో లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. ఎంతో చదువుకున్నావు. మంచి ఉద్యోగం చేశావు. ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉన్నావు ? నువ్వు ప్రశాంతంగా ఉండు. డాక్టర్ నీకు కిడ్నీలో సమస్యలు ఉన్నట్టు చెప్పలేదు కదా. వాళ్ళు అన్నివైపులనుండి రిపోర్టులు చేతిలోకి వచ్చాకనే సరైన ట్రీట్మెంట్ చెయ్యగలరు అని ఎన్ని సార్లు చెప్పాలి ? పదా. ముందు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుందువు గానీ.పోనీ నువ్వన్నట్టు అమ్మతో చెప్పి కూరల్లో ఒక వారం రోజుల పాటు నీకు ప్రత్యేకంగా ఉప్పు వేయకుండా వండమని చెప్పు. ఇంకా టీవీలో తలలు పగిలే రాజకీయ చర్చలు చూడటం మానెయ్యి. అప్పుడు పూర్తిగా బీపీ టెస్ట్ చేయించుకున్నాకనే ఈ టెస్ట్ చేయిస్తాను సరేనా ?" అన్నాడు శ్రీకాంత్ తండ్రికి ఓదార్పు మంత్రం వేస్తూ.
"ఒరేయ్ . నేను నువ్వనుకున్నట్టు ఈ ట్రీట్మెంట్ కు భయపడటం లేదురా. ఈ టెస్టులు పేరుమీదటా, ఆ తర్వాత తెలిసే పరిస్తితులను ఎదుర్కోవడానికి అయ్యే ఖర్చు గురించి తల్చుకుంటే భయమేస్తోందిరా. పోనీ నాకు మెడికల్ ఇన్సూరెన్స్ మీ కంపినీ ఇచ్చి ఆదుకుంటుంది అనుకుంటే నీకు అటువంటి ఫెసిలిటీ లేదు. మొత్తం ఆర్ధిక భారం నీమీద పడిపోతుంది. ఏవో మామూలు మందులు వాడేస్తే సరిపోదా? ఎప్పటికైనా పోవాల్సిందేగా ? అదీ నా ఉద్దేశ్యం. ...." అన్నాడు ఈశ్వర రావు ఆందోళనగా.
బీపీలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఒక వారం రోజుల తర్వాత ఈశ్వర రావుకు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించక తప్పలేదు. . రేపు ఉదయం రిపోర్టులు ఇస్తామని లాబ్ వాళ్ళు చెప్పడంతో వెనక్కి వచ్చేశారు తండ్రీ కొడుకులు.
ఇంటికి రాగానే ఈశ్వరరావు కొద్దిసేపు కాలుగాలిన పిల్లిలా తిరిగాడు. . అర్ధరాత్రి దాటినా కంటిమీద కునుకు రావడం లేదు. అతడేదో లోకంలో ఉన్నవాడిలా పిచ్చి చూపులు చూస్తున్నాడు. అతని పక్కన చాలాసేపు రాజేశ్వరి కూర్చుని ఉంది.
"ఏమోయ్. నాకా చూస్తూంటే హై బీపీ తగ్గేటట్టు కనిపించడం లేదు. ఏ పత్రికలో చూసినా, టీవీలో చూసినా ఇలాంటి కేసులకు మూల కారణం కిడ్నీలు సరిగ్గా పనిచెయ్యకపోవడమే అంటున్నారు. ఇక ఇందులో ముఖ్యమైన క్రియాటినిన్ కానీ బాగా పెరిగిపోతే ఖచ్చితంగా డయాలిసిస్ చేయించుకోవాలి. ఇంకా సమస్య ఎక్కువగా ఉంటే కిడ్నీలు కూడా మార్చాల్సిన పరిస్తితి కూడా ఉంటుందిట. అలాంటి క్రిటికల్ సమస్య వస్తే అసలు కిడ్నీలు దానం చేసే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు ఉంటారు ? ఇదే సమస్య ఉన్న ఆయనకెవరికో కొడుకు , కోడలు అవసరమైతే కిడ్నీలు ఇవ్వడానికి రెడీ అన్నారుట. పైకి అలా చెప్పుకుంటారు కానీ ఎవరైనా అలాంటి పని చేస్తారా ? చేస్తే తర్వాత పండంటే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి ? ఐనా రేపో మాపో చచ్చిపోయే ముసలాళ్ళ కోసం బలంగా ఉన్న వాళ్ళ నుండి కిడ్నీలు ఆశించడం న్యాయమేనా ? నేను ఆఫీసులో పని చేస్తున్నప్పుడు మా డిపార్ట్మెంట్లో ఒక యువకుడికి రెండు కిడ్నీలు పోతే ఒక కిడ్నీ పాపం అతని తండ్రి ఇచ్చి ఆదుకున్నాడు, అయితే తండ్రి ఆ తర్వాత మూడు నెలలకే పోయాడు. అలా కుర్రాళ్ళ కోసం చేస్తే సమాజం హర్షిస్తుంది కానీ నాలాంటి ముసలి వాళ్ళ కోసం కిడ్నీలు దానం చెయ్యమంటే అందరూ గడ్డిపెడతారు. ...." అంటూ భార్యతో తనకు రేపు రాబోయే రిపోర్ట్ గురించి మధనపడుతూ చెప్పుకుపోతున్నాడు ఈశ్వరరావు.
అప్పటికే రాజేశ్వరి అతనితో విసిగిపోయి ఉంది.
" ఏమిటండీ ఇదంతా ?నిద్రపోకుండా రాత్రంతా ఇదే ఆలోచిస్తారా ? నాకు ఏ రోగమొచ్చినా ఎటువంటి ట్రీట్మెంట్ చేయించొద్దని మీ కొడుకుతో రోజూ ఎన్నో సార్లు చాదస్తంగా చెప్పుకునే వాళ్ళు కదా. ఇప్పుడు చూడండి. ఏవేవో ఊహించుకుని ఎంతగా భయపడుతున్నారో ? ప్రాణం మీద భయం ఈ కాయం దాటిపోయే అంతవరకు ప్రతి వారికీ ఉంటుంది అండీ. ఇవి నేను ఇప్పుడు చెప్పాల్సిన మాటలు కావు. రేపు మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా, నాకు వచ్చినా పిల్లలు మనల్ని ఎంత డబ్బైనా పోసి కాపాడుకోవాలనే అనుకుంటారు తప్ప పోయే ప్రాణమే కదా ఎందుకు అంత ఖర్చు పెట్టాలి అని వదిలెయ్యరు. ఇక మీరు ఎక్కువగా ఆలోచించిన కొద్దీ మీ రోగాలు మరీ ఎక్కువయ్యి అవి వేరే వాటికి కూడా దారితీస్తాయి. ..." అంటూ అతని అతి వాగుడికి తాళం వేయాలని చూస్తోంది.
పైకి భర్తను సముదాయించడానికి ప్రయత్నిస్తోందే కానీ రాజేశ్వరి లోలోపల తనని తను నిగ్రహించుకోలేక పోతోంది..
తెల్లారింది. శ్రీకాంత్ కాస్త ముందుగా తయారయ్యి ఆసుపత్రికి దగ్గరికి చేరుకున్నాడు.
రాజేశ్వరి తన ఇష్టదైవానికి మాటికి మాటికీ భర్తకు ఏమీ ప్రమాదకరమైన రోగాలు లేకుండా చూడు తండ్రీ అని దణ్ణం పెట్టుకుంటోంది.
శ్రీకాంత్ నుండి ఫోన్ మోగింది.
"చూడవే. వాడు చెప్పే వార్త నా చెవులతో నేను వినలేను. నాకు భయంగా ఉంది. నువ్వు ధైర్యవంతురాలివి . ముందా ఫోన్ తియ్యి " అంటూ ఈశ్వర రావు పెళ్ళానికి పురమాయించాడు దడదడలాడుతున్న గుండెలతో.
"అమ్మా. నాన్నను ఏమీ కంగారు పడొద్దని చెప్పు. ప్రస్తుతం ఈ గండం గడిచింది. కిడ్నీలలో ఎటువంటి సమస్య లేదు. ముందు నువ్వు నాన్నను ధైర్యంగా ఉండమని చెప్పి ఇద్దరూ ఒకసారి ఆసుపత్రికి రండి. డాక్టర్ గారు రిపోర్టులు చూశాక బీపీకి ఏవైనా మంచి మందులిస్తారేమో మరి .." అన్నాడు.. అతని గొంతులో ఎక్కడలేని రిలీఫ్ కనిపిస్తోంది. .
" గుడ్ లక్ సార్. కిడ్నీల ఫంక్షన్ బాగానే ఉంది. క్రియాటినిన్ కూడా నార్మల్ గానే ఉంది. మీరు ఈ క్షణం నుండి ఎక్కువగా నీళ్ళు తాగాలి. దీర్ఘకాలంగా డీహైడ్రేషన్ తో బాధపడే వారిలో అధిక రక్తపోటు సర్వసాధారణం. శరీర కణాలలో నీరు లేనప్పుడు ఇటువంటి విపరీత పరిస్తితికి దారితీస్తుంది. ఈ జాగ్రత్తలతో పాటు నేను వేరే మందులు రాసిస్తున్నాను. క్రమం తప్పకుండా వాడండి. .." అని డాక్టర్ ఈశ్వర రావుతో చెప్పే సరికి ఆ మాటలతో అతనికి ఎక్కడలేని బలం వచ్చేసింది. అతని ముఖంలో ఇంతకు ముందు కనిపించిన ఆందోళనలు, టెన్షన్లు చటుక్కున మాయమయ్యాయి.
ఈ గండం గడిచింది చాలు అనుకుంటూ ముగ్గురూ కారులో ఇంటికి బయలు దేరారు. మార్గ మధ్యంలో ఈశ్వర రావు భార్యతో అంటున్నాడు" నువ్వు ఏమైనా అనుకోకానీ నాకు కిడ్నీల సమస్య లేదని తెలిసాక ఇప్పుడు నాకు ఏ రోగాలు లేనట్టుగా అనిపిస్తోంది. పైకి అలా అంటున్నాను కానీ నువ్వు చెప్పినట్టు రోగం వస్తే భయపడని వాళ్ళు ఎవరుంటారు ? పిల్లలు తల్లి తండ్రులను వాళ్ళ మానాన వాళ్ళను అలా వదిలేస్తే ఇక ఈ బంధాలకు విలువ ఎక్కడుంటుంది ? నా పక్కనుండి ప్రతి క్షణమూ శ్రీకాంత్, నువ్వూ దగ్గరుండీ చూసుకోకపోతే నేనేమయ్యే వాడినో కదా ? ఇప్పటికైనా నా మనస్తత్వం నేను మార్చుకోవాలి.నా ద్వంద్వ ప్రవృత్తితో మీ అందరినీ బాధపెట్టాను. ...." అంటూ ఉంటే ఈశ్వర రావు కళ్ల నుండి అప్రయత్నంగా కన్నీళ్లు జలజలా రాలిపోయి గుండెల్లోని భారం తగ్గి మనస్సుకు పూర్తి సాంత్వన దొరికినట్టయ్యింది**
సమాప్తం