శ్రేయోభిలాషి

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 09 Nov 2025 • 👁 2 views
“ శ్రేయోభిలాషి “ (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(9/11/2025 విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురణ )
రామన్న పంతులు గారు మా ఇంటికి వస్తున్నాడు అంటే మేము ఆయన కోసం కనీసం రెండు మూడు గంటలైనా హాయిగా , ఆనందంగా కేటాయించేస్తాం . . ఏదో ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆయన నుండి వింటున్నప్పుడల్లా మా అందరికీ అదో జీవిత పాఠంలాగా అనిపించేది. ఆయనకు భార్య చనిపోయి పదేళ్లకు పైగా అవుతోంది. అప్పటినుండి ఇంట్లో వంట అంతా ఆయనదే.
ఆయనకు రాని వంట అంటూ లేదు. పాత కాలం వంటలంటే చేసుకోవడం ఇష్టం. తినాలనుకున్నప్పుడు అప్పడాల పిండి కూడా ఉండలా చేసి , దానికి నూనె రాసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని నంచుకుని తినే వాడు. పూర్తిగా ఎండని పచ్చి బూడిద గుమ్మడి కాయ వడియాలు వేయించుకుని పప్పుల్లో నంచుకుని తినే వాడు. వడియాల పిండిని అన్నంలో కలుపుకుని తిని ఆ రుచిని ఆస్వాదిస్తూ టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పాత సినిమాలలోని పాటలు వింటూ కాలక్షేపం చేసే వాడు.
చాలా మందికి లాగానే షుగర్ వ్యాధి ఉండటంతో తినేదేదో పొద్దున్నే సుష్టిగా , పుష్టిగా తినేసి రాత్రికి ఏ గోధుమ రవ్వ ఉప్మానో చేసుకుని ఆ రోజుకు అయ్యింది అనిపించేవాడు ..
తనని ఎవరో ఒకరు భోజనానికి పిలవడం లేదని ఎప్పుడూ బాధపడే వ్యక్తిత్వం కాదు ఆయనది. “ నాకంత ఖర్మ ఏం కాలిపోయిందిరా ? భగవంతుడి దయవల్ల శరీరం సహకరిస్తున్నంత కాలం నాకు ఇష్టమైన వంటలన్నీ రుచికరంగా చేసుకోగలిగిన సత్తా ఉంది. మీకు ఎప్పుడైనా రావాలి అనుకుంటే నా ఇంటికే రండి. అన్ని వంటలూ రుచి చూపిస్తాను. హాయిగా ఎంజాయ్ చెయ్యండి . వెళ్ళండి ...” అంటూ తేలిగ్గానే తీసుకునే వాడు కానీ ఏ నాడూ తన పరిస్తితికి బాధ పడుతూ కూర్చోలేదు.
వారాంతంలో సాయంత్రప్పూట బాగా తెలిసిన వాళ్ళింటికి వెళ్లి ఒక గంటసేపు వాళ్ళతో ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పి వాళ్ళను కడుపుబ్బ నవ్వించే వాడు . వాళ్ళ కబుర్లలో రాజకీయాలు, సినిమాలు, సామాజిక అంశాలు ఎన్నో ఉంటాయి. తిరిగి ఇంటికి చేరుకొని మళ్ళీ తన గోధుమ రవ్వ ఉప్మా ఇవన్నీ మామూలే.
ఆ రోజు రామన్న పంతులు గారి ప్లాన్ ప్రకారం ఉదయాన్నే నాకు ఫోన్ చేసి చెప్పాడు తను వస్తున్నట్టు. అసలు ఆయన నాకు ఎలా పరిచయం అయ్యాడు అంటే నేను ఉదయాన్నే పార్కులో వాకింగ్కు వెళ్ళినప్పుడు ఎంతో ఆక్టివ్ గా హ్యాండ్ స్టిక్ ఊపుకుంటూ అలసట లేకుండా కనీసం ఇరవై రౌండ్లు తిరగడం , ఆయన్ని అనుసరించాలనే ప్రయత్నంలో నేను వెనక పడి సిమెంట్ బెంచీమీద ఆయాసంతో కూలబడి పోవడం అది ఆయన కంట పడింది. “ఏం పర్వాలేదు బాబూ ! “నాకేమీ బాధ్యతలు లేవు . ఇంటికి తొరగా వెళ్లిపోవాలన్న ఆలోచన ఉండదు. మీరంటే మళ్ళీ ఉద్యోగాలకు పోవాలి.ఈ పరిస్తితిలో మీ లాంటి వారు మాతో పోటీ పడాల్సిన అవసరం లేదు ... “ అనే వాడు నవ్వుతూ.
అలా మాటా మాటా కలవడం, అప్పుడప్పుడు ఆయన్ని మా ఇంటికి ఆహ్వానించడం , ఆయన సహజమైన ధోరణితో ఇంట్లో వాళ్లతో కూడా బాగా దగ్గరయ్యాడు. ఆయన మా దగ్గర గడిపిన సమయంలో మేము తీసుకునే శ్రమ అంటూ ఏదీ లేదు . మధ్యలో ఒక ఫిల్టర్ కాఫీనో, లేదంటే నిమ్మకాయ మజ్జిగతో సరి.
ఒక రోజు మా ఆవిడ “బాబాయి గారు మీరు ఇంట్లో అన్ని రకాల వంటలు రుచికరంగా చేసుకోవడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు అని విన్నాను. మీరు ఏ విషయం చెపుతున్నా చాలా కొత్తగా, ఆసక్తిగా ఉంటుంది. మీ నుండి ఈ కొద్ది కాలంలోనే ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈ సారి మీరు ప్రత్యేకంగా మా కోసం ఒక రోజు కేటాయించి వంటలలోని చిట్కాలు చెప్పాలి. టీవీలలో చూస్తూ ఉంటాను కానీ అవి అంతగా నన్ను ఆకర్షించలేక పోయాయి. వాటి గురించి మీద్వారా వినాలని కోరికగా ఉంది. ...” అంది నా భార్య మాధవి.
“ దానికేం భాగ్యమమ్మా. అసలు మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను వాటి గురించి మాట్లాడాలంటే నాకు పిచ్చి ఇష్టం. అయితే ఈ రోజుల్లో నాలాగా వంటల గురించి మాట్లాడుతూ ఉంటే భరించే వాళ్ళు ఎవరూ లేరు. చాదస్తం మనిషి అనుకుంటారు. ఇళ్ళకు కూడా రానివ్వరు. వాళ్లకు కావలసింది ప్రైవసీ. ఎక్కడో తిరగాలని అనుకుంటారు. ఏవేవో హోటళ్ళలో తినాలని అనుకుంటారు. అందుకే ఆ ప్రసక్తి నేను మీ దగ్గర ఎప్పుడూ తీసుకురాలేదు. మీరంతా అడుగుతున్నారంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. అది సరే. మీ అబ్బాయి పెళ్లి ఈ మధ్యే అయ్యింది కదా . కొత్త కోడలు వంటలు బాగా చేస్తుందా ?” అని అడిగాడు రామన్నపంతులు గారు .
“ తను ఏమి చెయ్యగలదో నేను గమనించలేదు లెండి. ఆ అమ్మాయిని అప్పుడే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే వంటగదిలోకి ఇంకా రానివ్వలేదు. అయితే నేను చేసినవన్నీ ఇష్టంతో తింటుంది. ఇంట్లోనే ఉంది లెండి. ఈ సారి మీ ప్రత్యేక కార్యక్రమానికి మా అబ్బాయి, కోడలు, మేమిద్దరమూ శ్రోతలు కాబోతున్నాం. ..” అంటూ మాధవి ఫిల్టర్ కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళబోయింది.
“తల్లీ. పొద్దున్నుంచి ఎందుకో గొంతు అంతా మండుతోంది. నీకు వీలైతే ఈ సారికి కాస్త వేడి వేడి పాలలో చిటికెడు పసుపు, మిర్యాల పొడి వేసి ఈయమ్మా . ..” అంటూ చనువుగా చెప్పి ఆ కార్యక్రమం పూర్తయ్యాక మా ఆవిడ కావాలని కోరుకున్న వంటల అంశాల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు రామన్నపంతులు గారు.
“చూడండి బాబూ ! మీ అందరికీ తెలుసు. నాకు రుచికరమైన వంటలు వండుకుని ఎవరి మీదా ఆధారపడకుండా తినడం అలవాటని. కాబట్టి వాటికి సంబంధించిన కామన్ టాపిక్ గురించే ఈ రోజు మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. .. దయచేసి ఓపిక చేసుకుని వింటారని భావిస్తున్నాను.
మనలో చాలా మంది కొన్ని పదార్ధాలను ఉపయోగించుకోవడం తెలియక వాటిని వ్యర్ధ పదార్ధాలుగా భావించి పక్కన పడేస్తూ ఉంటాం. ఒక్కొక్కటీ జాగ్రత్తగా ఆలకించండి. మీరు బీరకాయ, దోసకాయలను తరిగేటప్పుడు వాటిపై చెక్కును బయట పారవేస్తున్నారా ? అవసరమే లేదు. వాటిని శుభ్రంగా కడిగి పచ్చడి కాని లేక ఎండలో వుంచి ఒరుగులుగా చేసుకుని వేయించుకుని ఏ పప్ప్పులోనో నంచుకుని తినండి. పక్కన బీపీని పెంచే పచ్చళ్ళు తగ్గించండి.
ఆనప కాయ కూర వండుకునేటప్పుడు వాటిలోని విత్తనాలను పక్కనే ఎందుకు పారెయ్యాలి ? వాటితో పచ్చడి చేసుకుంటే అది కొబ్బరి పచ్చడిని తలదన్నేటట్టుగా ఉంటుంది అని మీలో ఎవరికైనా తెలుసా ?
అలాగే కాలిఫ్లవర్ పై ఉన్న కాడలను పారవేయ కుండా వాటిని పెసర పప్పుతో కలిపి వండితే దాని రుచి ఒక రేంజ్ లో ఉంటుంది అని అది నెలలో మూడు నాలుగు సార్లయినా వండుకుని తినే నాకు తెలుసు కాబట్టి చెపుతున్నాను.. ఇంకొంతమంది ముల్లంగి పైన వచ్చే ఆకులు పారేస్తారు. కూరల షాపుల దగ్గర పక్కనే చెత్త కింద పడేసి ఉంటుంది. అందులోని పోషక గుణాలు కానీ వాళ్లకు తెలిస్తే ఆకులకు ధరకట్టి అమ్ముకుంటారు. . పప్పు వండుకునే టప్పుడు ఖచ్చితంగా ఆకులతో సహా వండుకోవాలి అనేది ఈ నాటి పిల్లలకు తెలియనే తెలియదు .
ఇక అన్నం రాత్రి మిగిలిపోయినప్పుడు బయట పారేయ్యాలన్నా, పని మనిషికి ఇచ్చేయ్యాలన్నా ఉసూరుమంటూ ఉంటుంది. అసలు పనిమనిషికి ఇవ్వాలని చూసినా వాళ్ళు కూడా తీసుకోవడానికి ఇష్టపడటం లేదు లెండి. ఈ రోజుల్లో వాళ్లకు కావలసింది డబ్బు కానీ ఇలాంటి మిగిలిపోయినా పదార్ధాలు కాదు. అంత డబ్బు పెట్టి బియ్యం కొంటున్నప్పుడు ఎందుకు పారెయ్యాలి ? శుభ్రంగా ఎసరు పెట్టి ఆ అన్నాన్ని అందులో వేసి వార్చేస్తే తెల్లగా పువ్వులా అప్పటికప్పుడు వండిన ఫ్రెష్ అన్నంలా తయారవుతుంది. దానితో పులిహార చేసుకుని తినడానికి ఏం దొబ్బిడాయి చెప్పు ?
ఏమర్రా వింటున్నారా ? ఇంకో ముఖ్య విషయం చెపుతాను వినండి. ఒక్కోసారి పనుల్లో పడి చూసుకోకపోతే అన్నం ఘోరంగా చిమిడి పోయి ఏమి చెయ్యాలో తెలియక బుర్ర పనిచెయ్యదు. అందులో పచ్చి మిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర , తగినంత ఉప్పు వేసి మెత్తగా చేసి వడియాలు పెట్టుకోండి. బజారులో వాళ్లు ఏవేవో పదార్ధాలు వేసి తయారు చేసి అమ్మే రాళ్ళ వడియాలు తిని పళ్ళు ఊడగొట్టుకోవడం మనకవసరమా ?
మరో విషయం తల్లీ. . మజ్జిగ బాగా పులిసిపోయి అన్నంలో వేసుకోవడానికి వీలు లేనప్పుడు తగినంత మైదా, బియ్యంపిండి కలిపి దోసెలు వేసుకుంటే ఆ పూటకు టిఫిన్ ఖర్చు తప్పుతుందని తెలుసా ?
మరో చేదు నిజం చెపుతాను వినండి. బీరకాయలు ఒక్కోసారి చాలా చేదుగా ఉంటాయి. అంత ఖరీదు పెట్టి కొన్న వాటిని చేదుగా ఉన్నాయని బయట పడెయ్యగలమా చెప్పండి. దీనికి రామబాణం లాంటి ఉపాయం ఒకటి చెపుతాను. తరుక్కున్న ముక్కలను రెండు మూడు సార్లు వేడి నీళ్ళల్లో మరిగించి ఆ నీటిని పారబోస్తూ ఉండాలి. అప్పుడు దాంట్లో ఉన్న చేదు చాలా వరకు విరిగిపోతుంది. ఇక ఆ పూటకు వేరే ఆలోచన లేకుండా ఆ కూరను తినేయొచ్చు. అలా నేను చాలా సార్లు చేసుకుని తిన్నాను.మాకు అంత అవసరం లేదు అనుకున్న వాళ్ల విషయంలో బలవంతం లేదు. .
చాలా మంది ములక్కాడలను ఫ్రిడ్జ్ లో పెట్టటానికి కుదరక బయటే ఎండపెట్టేస్తూ అవి ఎందుకూ ఉపయోగించడానికి పనికిరాకుండా చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక పాలితిన్ కవర్లో ఉంచి ఫ్రిడ్జ్లో పడేస్తే ఎంత కాలమైనా నిలవ ఉంటాయి. ఆ .. వాదేస్తాంగా అని వాటిని ఏ టేబుల్ మీదో పడేసే ఎందుకూ పనికిరాకుండా చేస్తారు. అటువంటి బద్దకస్తులకు ఈ సలహా ఇస్తున్నాను సుమా. .
ఇంకో దివ్యమైన సలహా ఉందండోయ్ . ఇంట్లో సమయానికి కూరకాయలు లేనప్పుడు విచారిస్తూ కూర్చోక ఒక చిన్న గ్లాసుడు పెసర పప్పు, దానితో పాటు నాలుగైదు ఎండుమిరపకాయలు వేసి ముప్పావుగంటకు పైగా నానబెట్టి తగినంత ఉప్పూ, కొద్దిగా ఇంగువ పొడి వేసి గ్రైండర్లో రుబ్బుకుంటే ఆ పూటకు అన్నంలో ఆధరువుగా ఉంటుంది. దాంట్లో పోపు పెట్టుకో గలిగిన వాళ్ళు పెట్టుకోండి. లేదా ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే తృప్తిగా భోజనం చేసాం అన్న కోరిక తీరుతుంది. ఇక మీకు ఓపిక ఉంటె దానికి అనుపానంగా ఉల్లిపాయ పులుసు చేసుకుంటే మరీ మంచిది.
అలాగే కూరలు దొరకనప్పుడు ఇంకో ఉపాయం కూడా ఉంది. ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దానిలో తగిన పచ్చి మిరప, పసుపు, కొంత చింతపండు రసం వేసి బాణలిలో తగినంత నూనె వేసుకుని ఉల్లిపాయ రంగు మారే అంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అందరికీ తెలుసు కాబట్టి చెప్పడం లేదు. పోపు సామానులు వేయించుకుని గ్రైండర్ లేదా రోలులో నూరుకుని వేయించిన ఉల్లిపాయ మిశ్రమాన్ని కలిపి నూరేసుకోవడమే. నేను చెప్పడం కాదు కానీ అమ్మాయి. ఆ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేరుశనగ నూనె వేసుకుని తింటూ ఉంటే అసలు కూరలు ఎందుకు పనికి వస్తాయి వాటి ముందు ? కళ్ళ ముందు స్వర్గం కనిపిస్తుంది.
రామన్న పంతులు గారు వంటల గురించి వర్ణించి చెప్తూ ఉంటే మా అందరి నోళ్ళల్లో నీళ్ళు ఊరడం మొదలు పెట్టింది. బాగుండదు కానీ ఒకసారి అందరమూ ఆయనింటి మీద పడిపోతే ఎలా ఉంటుంది ? అన్న ఆలోచన కూడా నాతో పాటు మా వాళ్లకు కూడా వచ్చి ఉంటుంది.
పంతులు గారు మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు.
చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఇంకో ప్రతి ఇంట్లో బాగా ఉపయోగపడే చిట్కా చెపుతాను వినండి. ఇడ్లీలు మిగిలిపోయి చల్లగా ఉంటే తినలేం . వాటిని ఒకసారి మంచి నీళ్ళల్లో ముంచి మైక్రోవోవెన్ లో వేడి చేసుకుంటే పొగలు కక్కుతూ అప్పటికప్పుడు ఫ్రెష్ గా వేసుకున్న ఇద్లీలులాగా అనిపించి తినడానికి బాగుంటాయి. వాటినే కాస్త చిదిపేసి పోపు పెట్టుకుంటే పులిహోరలా మారుతుంది. ఇంకా మీకు స్నాక్స్ లాగా తినాలని అనుకుంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించు కుంటే గారుల్లాగా కరకర లాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి. లేదా పెనం మీద కొద్దిగా నూనె వేసి వేయించుకున్నా అద్భతంగా ఉంటాయి.
బెండకాయలను శుబ్రంగా కడిగి వాటి పొట్టను మధ్యలో చీల్చి కొద్దిగా జీలకర్ర కారం, కొద్దిగా ఉప్పూ, ఒక అర స్పూను నూనె వేసే, స్టవ్ మీద కాలిస్తే ఐదు నిమిషాలలలోనే బ్రహ్మాండమైన ఫ్రై తయారవుతుంది. కూరే వండుకోవాలన్న నియమం లేదు. . ఇదికూడా వేడి వేడి అన్నంలో నంచుకుని తినాలి...
వంట వండటం బ్రహ్మ విద్య కాదు. కాని కొన్ని మెళుకువలు, పద్దతులు తెలుసుకుంటే ఇంటిని స్వర్గ సీమగా మార్చు కోవచ్చు. పైన నేను చెప్పినవన్నీ చాలా మందికి తెలిసినా ముఖ్యంగా కొత్తగా కాపురం పెట్టిన వాళ్లకు బాగా ఉపయోగపడతాయి. ఏం వింటున్నావా మనవరాలా ? అదేనమ్మా నీ కోడలి పిల్లకు చెపుతున్నాను. నేనేదో చాదస్తంగా ఇవన్నీ చెప్పానని ఏమీ అనుకోకండి. నాకు అవకాశం దొరకడం, మీకు వినే ఓపిక ఉండటం వల్లే ఇవన్నీ చెప్పగలిగాను. మీ ఇంటికొచ్చిన వాళ్ళకు ఎవరికైనా ఆసక్తి ఉంటె ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలు వాళ్ళకూ చెప్పండి. సంతోషిస్తారు. మళ్ళీ ఒక పదిహేను రోజులు గ్యాప్ తీసుకుని మరో కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ఇంటికెళ్ళి మళ్ళీ నేను గోధుమ రవ్వ ఉప్మా చేసుకోవాలి కదా ...” అంటూ రామన్న పంతులు గారు అక్కడ నుండి కదిలి వెళ్లి పోతూ ఉంటే “ బాబాయి గారు ఇప్పుడు వెళ్లి ఆ ఉప్మా ఏం చేసుకుంటారు ? ఒకసారి నేను చేసిన ఉప్మా కూడా రుచి చూసి ఎలా ఉందొ చెప్పండి. తర్వాత ఈయన స్కూటర్ మీద తీసుకెళ్ళి ఇంటిదగ్గర డ్రాప్ చేసేస్తారు. పాపం ఈ వయసులో కూడా ఏ ప్రయోజనం ఆశించకుండా ఇంత విలువైన సలహాలు , సూచనలు ఈ రోజుల్లో ఇచ్చే వారు ఎవరు ఉంటారు ? ఒక్క పది నిమిషాల్లో మీ గోధుమ రవ్వ ఉప్మా తయారైపోతుంది. ..” అంటూ లేవబోయింది మాధవి.
“ ఈ సారి తప్పకుండా చేసి పెడుదువు గానిలే తల్లీ. నేను షుగర్, బీపీ మాత్రలు వేసుకునే రాత్రి టిఫిన్ తినాలి. ఈ హడావిడిలో అవి కానీ మర్చిపోయానంటే నా పని గోవిందా ! అయినా ఏమిటోనమ్మా ఎంత రాత్రైనా కూడా నా ఇంట్లో నేను వండుకుని తినడం అలవాటైపోయింది. పెద్దవాడిని కదా. నా చాదస్తాలు నాకు ఉంటాయి. ....“ అంటూ చెదరని చిరునవ్వుతో అక్కడ నుండి కదిలాడు మాకు చుట్టం కాని చుట్టం మా శ్రేయోభిలాషి అయిన రామన్న పంతులు గారు.******