సృష్టికి మార్గదర్శకుడు
(ఈనాడు దినపత్రిక 3/2/2026 అంతర్యామి శీర్షికన ప్రచురితం )
సృష్టి అనేది యాదృచ్చికంగా నడిచే ప్రక్రియ కాదు. దానికి ఒక క్రమం ఉంది, ధర్మం ఉంది. . ఒక నియమం ఉంది.. ఆ ధర్మానికి దిశానిర్దేశం చేసే శక్తే శ్రీకృష్ణుడు. ఆయన ద్వాపర యుగ అవతార పురుషుడు మాత్రమే కాదు. . . కాలం, దేశం, పరిస్థితులను దాటి నిలిచిన పరమసత్యానికి సాకార రూపం. సృష్టి ఎలా సాగాలి ,జీవితం ఎలా నడవాలి అనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన తత్వమే కృష్ణుడు. .
భగవద్గీతలో కృష్ణుడు “అహం సర్వస్య ప్రభవః” అని ప్రకటించాడు. ఈ సృష్టి నానుంచే ఉద్భవించింది. నాలోనే కొనసాగుతోంది అన్న ఆ వాక్యం కృష్ణ తత్త్వానికి మూలం. భౌతిక ప్రకృతి నుంచి జీవాత్మ వరకు అన్నీ ఒకే పరమచైతన్యానికి భిన్న రూపాలు. ఆ చైతన్యం మానవాళికి అందుబాటులోకి వచ్చినప్పుడే కృష్ణ స్వరూపంగా అవతరిస్తుంది. అందుకే ఆయన బోధ మాటకే పరిమితం కాక జీవన అనుభవంగా మారింది.
ధర్మం క్షీణించినప్పుడు ఆయుధాలు ఎత్తడం కాదు, ఆలోచనలకు దారి చూపడమే కృష్ణుని ప్రత్యేకత. కురుక్షేత్రంలో ఆయన యోధుడు కాదు సారథి. యుద్దాన్ని నడిపించడమే కాదు జీవితాన్ని నడిపించే విధానాన్ని నేర్పాడు. అర్జునుడి విషాదం కేవలం ఒక యోధుడి సందేహం కాదు. అది ప్రతి మనిషి హృదయంలో జరిగే అంతర్మధనం .ఆ సందేహానికి గీత రూపంలో ఇచ్చిన సమాధానం సమస్త సృష్టికి మార్గదర్శకం అయ్యింది .
కృష్ణుడు చెప్పిన కర్మయోగం సృష్టిని నడిపించే సహజ నియమం. ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వహించడమే నిజమైన జీవన ధర్మం. సూర్యుడు వెలుగును పంచినట్టే, నది ప్రవహించినట్టే, చెట్టు నీడనిచ్చినట్టే మనిషి కూడా తన బాధ్యతను నిర్వర్తించాలి.ఫలితంపై మోజు పడినప్పుడు మనిషి బంధనాల్లో చిక్కుకుంటాడు. కర్తవ్యంపై నిలిచినప్పుడు విముక్తి దిశగా సాగుతాడు. ఈ సత్యాన్ని అత్యంత సరళంగా అర్థమయ్యేలా వివరించినవాడే కృష్ణుడు.
భక్తిని కృష్ణుడు సంకుచితం చేయలేదు. గోపికల ప్రేమలో, యశోదమ్మ వాత్సల్యంలో, సుదాముడి స్నేహంలో భక్తికి విశాల అర్థం ఇచ్చాడు. భగవంతుడిని చేరడానికి గొప్ప ఆచారాలు కాదు, నిష్కపట హృదయం చాలునని స్పష్టంగా బోధించాడు. భక్తీ భయంతో కాదు. భక్తీ ప్రేమతో పుట్టాలనేదే ఆయన సందేశం.
కృష్ణుడు ధర్మానికి, సమతుల్యతకూ ప్రతీక. క్షమ ఎక్కడ అవసరమో తెలుసు, శిక్ష ఎక్కడ తప్పదో కూడా తెలుసు. ఈ సమతుల్యతే సృష్టి నిలకడకు కారణం.
నేటి కురుక్షేత్రంలో పోరాటం ఆయుధాలతో కాదు; లోపలి భయాలతో, లోభాలతో , అస్థిరతలతో. ఇటువంటి సమయంలో కృష్ణ సందేశం మరింత అవసరం.
అందుకే కృష్ణుడు దేవుడిగానే కాదు, జీవన మార్గదర్శకుడిగా మనల్ని చెయ్యిపెట్టి నడిపిస్తాడు . వ్యక్తిగత జీవితంలోనూ, సామాజిక వ్యవస్థలోనూ, మనిషి దారితప్పుతున్న వేళ , లోపలనుంచే దారిచూపే శక్తిగా ఆయన నిలుస్తాడు. మనిషి అయోమయంలో చిక్కుకోకుండా ,ధర్మబాటలో నడవాలంటే కృష్ణతత్వాన్ని అర్ధం చేసుకోవాలి.దాన్ని మనసులో నిలుపుకున్నప్పుడే జీవితం అర్ధవంతమవుతుంది. **