నీలి నీడలు

తపస్వి, ప్రతిలిపి • 👁 5 views
నీలి నీడలు

దీపాల కాంతులతో మెరిసిపోతున్న పెళ్లి మండపం, రంగురంగుల పూల తోరణాలు, చిరునవ్వుతో పెళ్లిపీటలు మీద కూర్చుని వుంది హైందవి.

మేనత్త, మేనమామ హోదాలో అన్నిటిలో తామే అయి తమ స్నేహితుడు సూర్య స్నేహితురాలు అన్సిక ల కూతురు హైందవి, పెళ్లి జరిపిస్తున్నారు కార్తీక్, సంగీత.

ఆ వాతావరణాన్ని చూస్తూ ఆన్సిక కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన కూతురు ఆమె ప్రియ నేస్తం భార్గవ్ తో కొత్త అధ్యాయానికి అడుగుపెడుతుండగా, ఆమె మనసు గతానికి పరుగు తీసింది.

శిధిలమైన జ్ఞాపకాలన్ని కళ్ళముందు తేనెతుట్టెలో తేనెటీగలు లాగా ఒక్కసారిగా ముసురుకున్నాయి.
………………..

ఆన్సిక చిన్నతనం నుంచి స్వేచ్ఛను కోరుకునే వ్యక్తి. జీవితాన్ని తనంతట తానే గడపాలని, సమాజపు పరిమితులను లెక్కచేయక ముందుకు సాగాలని అనుకునేది.

సెయింట్ మేరీ కాలేజ్,
"అందాల రాణి" అన్సిక.
ఆమెతో ఒక్కసారి మాట్లాడినా చాలని పరితపించి పోయేవాళ్ళు కుర్రాళ్ళంతా,
అమ్మాయిలు అయితే ఆమె పక్కన ఉంటే చాలు వాళ్లకి గ్లామర్ వచ్చేసింది అన్నంత ఫీల్ అయిపోయి ఆమె చుట్టూనే ఉండేవాళ్ళు.

సూర్యతేజ, కార్తీక్ ఇద్దరు కాలేజ్ టాప్పర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇద్దరికీ అన్సిక అంటే క్రేజ్, ఆమె కోసం పోటీపడుతూ వుండేవాళ్ళు.

సూర్యతేజ, సుడిగాలిలా సందడిగా వుండేవాడు. కార్తీక్ పౌర్ణమి చంద్రుడిలా ఆహ్లాదంగా ఉండేవాడు.

కాలేజిలో అన్సికకు కార్తీక్ అంటే ఇష్టమే కానీ,
సూర్య హుషారుగా, సరదా, స్పొంటేనియస్గా, మాట్లాడుతూ అందరిని నవ్వించేవాడు. సూర్య ఎక్కడ వుంటే ఫ్రెండ్స్ అందరు అక్కడే వుండేవారు,
సూర్యతేజ హుషారు చిలిపితనానికి ఆకర్షితులైoది, కార్తీక్ కంటే సూర్యవైపు మొగ్గు చూపింది అన్సిక.

వాళ్ళిద్దరు బీచ్, సినిమాలు, రెస్టారెంట్ లకు తిరుగుతూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం.

కాలేజ్లో వీళ్ళను “ప్రేమపక్షులు” అని పిలిచేవారు.
…………….
మంచి పెళ్లి సంబందo వచ్చింది పెళ్ళికొడుకు అమెరికాలో ఉంటాడు లక్షల్లో జీతం కారు, బంగ్లా, కూతురు సుఖపడుతుంది. అని పెళ్లి నిశ్చయించారు అన్సిక, అమ్మ నాన్న.

“నాన్న అప్పుడే పెళ్లి చేసుకోను, నేను ఇంకా చదువుకోవాలి.” అంది అన్సిక.

“డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోవస్తున్నాయి, కావాలంటే పెళ్లి తరువాత చదువుకో, నువ్వు చదువుకుంటాను అంటే అబ్బాయి వాళ్ళు కాదనరు, మేము ముందే చెప్పి వుంచాము.”

“లేదమ్మా! నేను చదువు పూర్తయిన తర్వాత జాబ్ చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటాను అప్పటి వరకు పెళ్లి మాటలు వద్దు.” అని ఖచ్చితంగా చెప్పింది.

“నీకేమైనా పిచ్చా! నిన్ను వెతుక్కుంటూ వచ్చిన సంబందాన్ని కాదనుకోవటం తప్పు, నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఇంత మంచి పెళ్లి సంబందం మళ్ళీ రాదు.” అంది అన్సిక తల్లి కోపంగా.

“అమ్మ, కాలం మారింది ఆడపిల్లల స్వేచ్ఛగా బతకాలి అనుకుంటున్నారు. మీరిలా చదువు పూర్తవకుండానే పెళ్లి చేసి మరో ఇంటికి నన్ను జీవిత ఖైదీలా పంపిస్తాను అంటారేంటి?”

“పెళ్లంటే జీవితఖైదు ఎలా అవుతుంది. పెళ్లితో నీకొక బంధం బాధ్యతా ఏర్పడుతుంది.”

“అమ్మా! నువెన్ని చెప్పినా నా మనసు మారదు.” అంది అన్సిక.

“ఆడపిల్లలు స్వేచ్ఛ, ఆధునికత పేరుతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. చదివింది చాలు మా మాట విని అమెరికా సంబంధం చేసుకో సంతోషంగా ఉంటావు.” అన్నాడు అన్సిక తండ్రి కోపంగా.

“అది కాదు నాన్నా.” అంది.

“ఇంకేమి మాట్లాడకు.” అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు.

అక్కడే ఏడుస్తూ కూర్చుంది.

అన్సిక, సూర్యతేజ ఇల్లొదిలి పారిపోయారు అన్న వార్త ఊరంతా గుప్పుమంది.

అన్సిక తల్లితండ్రులు కాలేజ్ కి వచ్చి గొడవ చేశారు, ఆన్ని చోట్ల వెతికారు వాళ్ళకోసం,
ఎక్కడా వాళ్ళ ఆచూకీ దొరకలేదు. కొన్నాళ్ళకు అందరూ మరచిపోయారు.
…………….

“అన్సిక, ఇక్కడ ఉన్నావా? పంతులుగారు పిలుస్తున్నారు.” అని వచ్చారు కార్తీక్, సంగీత.

ఆలోచనల నుంచి బయటపడి, వాళ్లతో కలిసి వెళ్లిoది.
కూతురు పెళ్లిలో ఆన్సికకు తన జీవితo కళ్ళలో మెదులుతుంది. తన స్వేచ్ఛ, ఆధునిక ఆలోచనలు కొన్ని తప్పులు చేయించాయి కానీ, తన జీవన అనుభవం ఇప్పుడు తన కూతురికి ఒక పాఠమై నిలుస్తుంది. హైందవి జీవితం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించింది.
ఆనందంతో వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంది.

“పెళ్లి చాలా బాగా జరిగింది ఇంకెందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు.” అన్నారు కార్తీక్, సంగీత.

“కార్తీక్, ఎంత వద్దనుకున్న నా గతం తాలూకు నీలినీడలు నన్ను వదిలిపోవటం లేదు.” అంది అన్సిక.

“ఏయ్ అన్సిక, ఊరుకోవే నువ్వలా బాద పడుతుంటే చిన్నపిల్ల బెంబేలెత్తి పోతుంది.” అంది ఓదార్చుతూ సంగీత.

కళ్ళు తుడుచుకుని పెళ్ళితంతు పూర్తిచేసి కూతుర్ని అత్తవారింటికి సాగనంపింది అన్సిక.

కార్తీక్, సంగీత అక్కడే వుంటాము అని చెప్పినా వద్దు పెళ్లి పనులు మొదలైన్ప్పటినుంచి అన్ని పనులు మీరే చూసుకుంటూ అలసిపోయారు. ఎడారిలో ఓయసిస్సులా మీ లాంటి స్నేహితులు దొరకటం నా అదృష్టం వెళ్లి రెస్ట్ తీసుకోండి అని చెప్పి పంపించింది.

వెళ్తున్న స్నేహితుల వైపు చూస్తూ, ఖాళీ అయిన మండపంలో దిగులుగా కూర్చుంది.

వాళ్ళిద్దరు తనని కలసిన రోజు తను ఇంకా మర్చిపోలేదు.
………………

ఆదిత్య పబ్లిక్ స్కూలు,

ఆఫీస్ రూమ్లో కూర్చుని వర్క్ చేసుకుంటున్న అన్సిక,

“గుడ్ ఈవినింగ్ మేడం అన్న పిలుపుకి, ‘ఈ గొంతు ఎక్కడో విన్నట్టు వుందే.’ అని తల పైకెత్తి కార్తిక్, సంగీతలను చూసి ఆశ్చర్యపోయింది. సంగీత తన క్లాస్మేట్ బెస్ట్ ఫ్రెండ్,

వాళ్ళుకూడా షాకింగ్గా ఆన్సికను చూసి పట్టుపట్టి వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చారు.

“మిమ్ములను చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. మీ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు?” అని అడిగింది అన్సిక.

కాలేజ్ లాస్ట్ డే తనే వచ్చి నాకు ప్రపోజ్ చేసింది. తనంటే సాఫ్ట్ కార్న్ ఉండటం వలన తన లవ్ యాక్సెప్ట్ చేశాను. కాకపోతే పెళ్లి మాత్రం చదువు పూర్తిచేసుకుని జాబ్లో సెటిల్ అయిన తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.

అలాగే మాఇద్దరి చదువులు పూర్తయిన తర్వాత ఇద్దరికీ మంచి జాబ్ వచ్చింది. అప్పటికి మేము జీవితం మీద ఒక అవగాహన పరిపక్వతతో పెళ్లికి ప్రిపేర్ గా ఉన్నాము. పెద్దల సమక్షంలో మా పెళ్లి ఘనంగా జరిగింది. అన్నాడు కార్తీక్.

ఎలా వున్నావు అన్సిక,
ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు, సూర్య ఎక్కడ? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? అని అడిగింది సంగీత, ప్రశ్నలన్నీ ఒక్కసారే బాణాల్లా సంధిస్తు,

స్నేహితులను చూశానన్న ఉత్సాహం ఒక్కసారిగా నీరు కారిపోయింది,
ఆమె మొహంలో బాధ తాలుకు ఛాయలు అలుముకున్నాయి.

“ ఆరోజు నన్ను ఇంట్లోనే బందించి ఉంచినప్పుడు, సూర్యకు అన్న వరసైన రాజేష్ మాకు హెల్ప్ చేసి ఎవరికి తెలియకుండా మమ్ములను ముంబయి ట్రైన్ ఎక్కించి పంపించేశాడు. అతనే ముంబయి లో హోటల్ రూమ్ బుక్ చేశాడు.

ఇంట్లోనుంచి తీసుకు వెళ్ళిన డబ్బులతో కొన్ని రోజులు బాగానే గడిచింది,
కొన్నాళ్ళకు తెచ్చిన డబ్బులు ఖర్చు అయిపోయింది,

ఒక గల్లీలో గది అద్దెకు తీసుకుని అందులోకి వెళ్ళాము,

తెలిసి తెలియని వయసులో అన్ని నాకే తెలుసు అనే భ్రమలో పెద్దలను ఎదిరించి ఇంట్లోనుంచి పారిపోవటం ఎంత తప్పో కొద్దీ రోజుల్లోనే తెలిసొచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు ఆకలితో మంచి నీళ్లు తాగుతూ కొన్ని రోజులు గడిచాయి.

“ఆకలి మంటలో ఆకర్షణ కాస్త ఆవిరై ఒకరినొకరు నిందించుకునే పరిస్థితికి వచ్చింది.”

షాపులో సేల్స్ గర్ల్ గా జాయిన్ అయ్యాను, ఎప్పుడైనా సినిమాలో బ్యాగ్రౌండ్ లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేదాన్ని. ఆ డబ్బులు సరిపోయేవి కాదు,

సూర్యకు చిన్న పనులు చేయటం ఇష్టం లేక ఉద్యోగంకోసం పగలంతా తిరిగి సాయంత్రానికి వచ్చేవాడు.
నా దగ్గర డబ్బులు లాక్కుని బాగా తాగి,
“నీ వల్లే నా జీవితం నాశనం అయింది, అమ్మా నాన్నల గారాల బిడ్డని కాలేజీలో ఫ్రెండ్స్ తో బిందాస్ గా తిరిగే వాడిని.
నువ్వు శనిదేవతవి, అని రోజు తిట్టి, కొట్టేవాడు.
………………

“ఒక రోజు పొద్దున్నే ఒసేయ్ శనిదేవత.
ఎక్కడ చచ్చావే.” అని అరవటం మొదలు పెట్టాడు.

“ఏమి రాత్రి తాగింది దిగలేదా పొద్దున్నే మొదలుపెట్టావు.” అని అరిచింది షాప్కి వెళ్ళే తొందరలో,

“ఏమే అరుస్తున్నావు, కాలేజ్ టాపర్ ఇక్కడ,
అడుతుపాడుతు ఎంజాయ్ చేసేవాడిని, నీ కోసం నీతో వచ్చి ఇలా తయారయ్యాను, రాజేష్ అన్న ఫోన్ చేశాడు. నా మీద కోపంతో నాన్న నా కాలేజ్ సర్టిఫికెట్లు బూడిద పాలు చేశారoట, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ” అని చిన్నపిల్లాడిలా ఏడవటం మొదలు పెట్టాడు,

ఎలా ఓదార్చాలో అర్దం కాలేదు, పెద్దల మాట వినకుండా, చదువు పూర్తి చేయకుండా,
ఇంట్లోనుంచి పారిపోయి వచ్చి ఉద్యోగం లేక ఎంత తప్పుచేసాము, అని బాధపడింది,
క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నoదుకు ఇద్దరు క్షణక్షణం బాధపడుతూనే ఉన్నారు.
తిరిగి ఇంటికి వెళ్ళటానికి "మొహం చెల్లక "వెళ్లినా తల్లిదండ్రులు రానివ్వరు అని భయంతో అక్కడే ఉండి కష్టాలు పడుతున్నారు.

“డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదువు కంప్లీట్ చేద్దామని” సూర్యకు నచ్చచెప్పి,

కొత్త సీరియల్లో చిన్న వేషం వుంది రమ్మని ఫోన్ రావటంతో, వంట చేయటానికి సామాన్లు కూడా లేక వంట చేయకుండానే వెళ్ళిపోయింది.

వాళ్లతో మాట్లాడి అడ్వాన్స్ డబ్బులు తీసుకుని సూర్యతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదివిoచాలి ఇలాగే ఇంకా కొన్ని సీరియల్స్ లో ఆఫర్స్ వస్తే కష్టాలు గట్టెక్కుతాయి అనుకుoటు ఆనందంగా ఇంటికి వచ్చింది.

దగ్గరకు వేసిఉన్న తలుపులు తోసి, అస్తవ్యస్తంగా పడివున్న సూర్యను చూసి, గబగబా లోపలికి పరిగెతింది పక్కనే పడివున్న పురుగులు మందు డబ్బాను చూసి జరిగింది అర్థమైంది. కట్టెలా మారిన అతని శరీరాన్ని పట్టుకొని కుమిలి కుమిలి ఏడ్చింది.

స్థానికులు సూర్య ఫోన్ నుంచి నెంబర్లు చూసి సూర్య తల్లిదండ్రులకు, రాజేష్ కు ఫోన్ చేశారు.

“అతని తల్లిదండ్రులు కార్యక్రమాలు పూర్తిచేసి నా కొడుకుని పొట్టన పెట్టుకున్న రాక్షషివి.” అని తిట్టి, దుమ్మెత్తి పోసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

అన్సిక తల్లిదండ్రులు ఫోన్ చేసి,
“నువ్వు ఇక్కడకు వస్తే మేము తల ఎత్తుకు బతకలేము, ఇంటిల్లిపాదీ ఉరేసుకుంటామని” బెదిరించి ఆమెకు న్నీళ్ళువదిలేసారు.

అప్పటికి అన్సిక నాలుగు నెలల గర్భవతి

సూర్య అన్న రాజేష్ మాత్రం అప్పుడప్పుడు వచ్చి చూసి వెళుతూ ఉండేవాడు.,

రాజేష్ ఇచ్చిన ధైర్యంతో, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా బీఎడ్ కట్టింది.

“ఒక రోజు మనం పెళ్లి చేసుకుందామా?” అని అడిగాడు హఠాత్తుగా రాజేష్.

“ పెళ్ళా?” అoది ఆశ్చర్యంగా,

“మా ఇద్దరికీ పడలేదు, విడాకులు తీసుకున్నాము, నీకు ఎవరు లేరు, నాకు తోడు లేదు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నిన్ను, నీకు పుట్టబోయే బిడ్డకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను.” అని నమ్మబలికాడు రాజేష్.

తోడు లేని నిస్సహాయత, బలహీన క్షణాలు, రాజేశ్‌తో పెళ్లికి ఒప్పుకుంది అన్సిక.

ఎవరికి తెలియకుండా గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకుని హైదరాబాద్ తీసుకుని వచ్చాడు రాజేష్. నెలలునిండి ఆడపిల్లకు జన్మనిచ్చింది అన్సిక.

రోజులు గడిచేకొద్దీ అతని నిజ స్వరూపం బయట పడటం మొదలుపెట్టింది,
ఒకరోజు రాజేష్ మొదటి భార్య వేదవతి వచ్చి అన్సికను రకరకాల మాటల బాణాలతో దూషించి, హింసించి అతనితో నాకు ఏం సంబంధం లేదని వదిలేసి వెళ్ళిపోయింది.

అప్పుడే తెలిసింది, అతను ఇంకా విడాకులు తీసుకోలేదు అబద్ధం చెప్పాడని.
చుట్టుపక్కల జనాల మాటలతో తల తీసేసి నట్లయింది ఎవరికి మొహం కూడా చూపించలేకపోయింది,

అప్పటినుంచి మరీ పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు రోజుకో ప్రొడ్యూసర్ అని డైరెక్టర్ అని మగవాళ్ళను తీసుకుని వచ్చి వాళ్లకి రకరకాల వంటలు చేయమని చెప్పి వడ్డించమనేవాడు. వాళ్ళ ఆకలి చూపులు చేష్టలు తట్టుకోలేకపోయింది.
నేను ఇంకా నటించాలి అనుకోవటం లేదు. ఎవరిని ఇంటికి తీసుకు రావద్దు ఏదో ఒక జాబ్ చూసుకుంటాను అంది.
ఒళ్లంతా వాతలు పెట్టేవాడు. అనుమానంతో, హింసించేవాడు, రోజు నువ్వు ఎవరితో తిరుగుతున్నావని తిట్టేవాడు, కొట్టేవాడు, నీవల్లే బంగారం లాంటి నా భార్య వెళ్ళిపోయింది అని హింసించేవాడు. అతని ఆగడాలు తట్టుకోలేకపోయింది. తన జీవితం పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది అని బాధపడింది. కానీ, ఈసారి పోరాడి తన స్వేచ్ఛను తిరిగి పొందాలి అని నిర్ణయించుకుంది.

పోలీస్ కంప్లయింట్ చేసింది. పోలీసులు రాజేష్ ను అరెస్టు చేశారు.

తర్వాత అతనితో విడాకులు తీసుకుని.
పాప కోసమే ఎలాగైనా బతకాలని నిర్ణయించుకుంది, తనకు తాను ధైర్యం చెప్పుకుంది, బిఈడి డిగ్రీ తో స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యింది. ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు చెప్పుకుంటూ పాపను పెంచింది,

పాప హైందవి పెద్దది అయ్యింది. మనవరాలి కోసం ఇక్కడికి రమ్మని అత్తగారు మామగారు చెప్పటంతో వాళ్లకు తోడు తనకు నీడ కావాలని ఇక్కడికి వచ్చి స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆదిత్య పబ్లిక్ స్కూల్ లో ప్రిన్సిపల్గా చేస్తున్నాను అంది.”

అన్సిక కథ విని కార్తీక్ కళ్ళు చెమ్మగిల్లాయి, అతని ఫ్రెండు సూర్య లేడని తెలిసి తల్లడిల్లిపోయాడు,
సంగీత కళ్ళవెంట నీళ్ళు ధారాపాతంగా కారిపోతూనే ఉన్నాయి.

సారీ! నా కథ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాను అంది బాధగా,

“కళ్ళు తుడుచుకుని, మమ్మల్ని స్కూల్ కి ఎందుకు రమ్మని కబురు చేసినట్లు.” అని అడిగాడు కార్తీక్. వాతావరణాన్ని చల్లపరుస్తూ“

కార్తీక్! నీ కూతురు అక్షర కూడా నీలాగే చదువులో, కల్చరల్ యాక్టివిటీస్లో చాల ఫాస్ట్. మహిళల దినోత్సవ సందర్భంగా అక్షరతో వ్యాసం రాయించి స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ రోజు స్టేజ్ మీద తనతో చెప్పించాలి అనుకుంటున్నాను. దాని గురించి మాట్లాడటానికి పిలిపించాను.” అంది అన్సిక.

“ఓ గ్రేట్, అక్షరకు కూడా స్టేజ్ పర్ఫామెన్స్ అంటే చాలా ఇష్టం.” అన్నాడు కార్తీక్.

“అన్సిక నువ్వేమి మారలేదు, అదే అందం, నాజుకుతనం, అనుభవాలు పాఠాలుగా మలుచుకుని నిలదొక్కకోవడం వలన వచ్చిన ఆత్మస్థైర్యం, హుందాతనంతో ఇంకా నిండుగా వున్నావు.” అంది సంగీత మెచ్చుకుంటూ అన్సికకు బొట్టు పెట్టి, చీర జాకెట్ తాంబూలం ఒడిలోపెట్టింది.

“అన్సిక! నీకు ఎటువంటి అవసరం వచ్చినా ఈ అన్న,వదిన ఉన్నారని మర్చిపోకు.” అన్నాడు కార్తీక్.

చమ్మగిల్లిన కళ్ళతో తనకొక భరోసా దొరికిందని ఆనందంతో ఇంటిదారి పట్టింది అన్సిక.
……………..

ఆదిత్య పబ్లిక్ స్కూల్ విశాఖపట్నం.

8th క్లాస్ చదువుతున్న అక్షర, మహిళల స్వాతంత్ర్యం గురించి వ్యాసం చదువుతుంది.

మహిళలు స్వతంత్రంగా ఉండాలి. తమ నిర్ణయాలను ఆలోచించి తీసుకోవాలి.కానీ ఆధునిక పోకడలతో భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోకూడదు, వారు తమ కుటుంబాలను మరియు సమాజాన్ని విస్మరించకూడదు, పరిపక్వతతో, జీవన అనుభవంతో ముందుకు సాగడం ఎంతో అవసరo.

తల్లిదండ్రులు కూడా పిల్లల నిర్ణయాలను తప్పు పట్టడం కంటే మంచి చెడులను విశ్లేషించి చెప్పటం చాలా అవసరం. వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం వలన కొంతమంది జీవితాలు అయినా సంతోషంగా ఉంటాయి. అని చెప్పింది అక్షర.
చప్పట్లతో హాల్ అంతా ప్రతిధ్వనించింది.

……..సమాప్తం………


అంజనీదేవి శనగల
విశాఖపట్నం