ఆశల పల్లకి

తపస్వి • 👁 15 views
ఆశల పల్లకి

నాలుగు గదుల పెంకుటిల్లు, పెద్ద వరండా.ఇంటి చుట్టూ మల్లె, జాజి, గులాబీ పూల మొక్కలు గడపకు పసుపు కుంకుమతో బొట్టు పెట్టి, ఇంటిముందు ఆవరణంతా ముగ్గులతో
అందమైన పొదరిల్లులా ఉంది సరస్వతి నిలయం.

ఆ రోజు శనివారం. ఉదయాన్నే స్నానం చేసి, వెంకటేశ్వర సుప్రభాతం వింటూ పూజ ముగించుకుని, వరండాలో కూర్చుని
‘శ్రీ వేంకటేశ్వర వ్రత కథలు’ పుస్తకాన్ని తిరగేస్తూ చదవుతుంది సరస్వతమ్మ.

“సంధ్య ఆఫీస్ కు టైం అయింది బాక్స్ పెట్టావా” అని అడిగాడు ప్రశాంత్ బైక్ బయటకు తీసి,

“హా పెట్టానండి.” అని హడావిడిగా చీరకొంగుతో మొహం తుడుచుకుంటూ వచ్చి క్యారేజ్ బ్యాగ్ ప్రశాంత్ కి అందించింది.

“అమ్మ! వెళ్లొస్తాను” అని చెప్పాడు, పుస్తకం చదువుతున్న తల్లితో.

“క్షేమంగా వెళ్లి లాభంగా రా” అంది

“బై డాడీ” అని చెప్పారు ఆరేళ్ల క్రాంతి ఏడేళ్ళ కవిత.

“బై రా పిల్లలు” అని చెప్పి బైక్ కిక్ కొడుతున్నాడు ప్రశాంత్.

ఇంతలో ఎదురింటి పెద్ద బంగ్లా గేట్ తీశాడు వాచ్మెన్.
బంగ్లాలో నుంచి అవినాష్ ఆడి కార్ ప్రశాంత్ పక్కన్నుంచే దూసుకుపోయింది.

ఆ వెనుకే అవినాష్ కూతురు స్నిగ్ధ ఒక కార్లో,
కొడుకు విరాజ్ స్పోర్ట్స్ బైక్ మీద స్పీడ్ గా వెళ్ళిపోయారు.

వాళ్ళ వెనకే అవినాష్ భార్య శ్వేత, హైహీల్స్ చెప్పులు, చేతికి గోల్డెన్ వాచ్, కళ్ళకు కాస్ట్లీ గాగుల్స్, మెడలో డైమండ్ నెక్లెస్ వేసుకుని స్టైల్ గా బంగ్లా నుంచి బయటికి వచ్చి తన బీఎండబ్ల్యూ కారు డ్రైవ్ చేసుకుంటూ రయ్ మని వెళ్ళిపోయింది.

అందరూ వెళ్ళిన తర్వాత గేటు వేసి లోపలికి వెళ్ళాడు వాచ్మెన్.

ప్రశాంత్ ఆఫీస్ టైం అయిపోతున్న సంగతి కూడా మర్చిపోయి వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయాడు.
’ఆహా జీవితo అంటే అది కదా’ అనుకున్నాడు.

తన పాత ఇంటిని తన డొక్కు బైక్ ని ఒకసారి చూసుకున్నాడు. ’అవినాష్ కాలేజ్లో తనకు సూపర్ సీనియర్ సాధారణ కుటుంబమే, సడెన్గా ఇంత డబ్బు, హడావిడి ఎలా వచ్చాయో’ అనుకున్నాడు ప్రశాంత్.

ప్రతిరోజు ప్రశాంత్ ఆఫీస్ కి వెళ్ళటానికి బయటకు రావడం, తన పాత బైక్ స్టార్ట్ కాకపోవడం, తను కుళ్ళుకునేలా ఎదురు బంగాళా వాళ్ళందరూ వరుసపెట్టి కాస్ట్లీ కారుల్లో బైక్ ల మీద వెళ్లిపోవటం వాళ్ళని చూస్తూ ఉండిపోవటం ప్రశాంత్ దినచర్యగా మారిపోయింది.

“అల్లుడు వాళ్ళు వెళ్ళిపోయారు.” అన్నాడు సుబ్రహ్మణ్యం. ఆలోచిస్తూ నిలుచున్న అల్లుడిని చూస్తూ,

సుబ్రహ్మణ్యంకు సంధ్య ఒక్కతే కూతురు, ఈమధ్య భార్య చనిపోవడంతో, అప్పుడప్పుడు కూతురి దగ్గర కొద్దిరోజులు ఉండి వెళుతుంటాడు.

ఆయన వైపు ఒకసారి చూసి, కోపంగా బైక్ కిక్ కొట్టాడు పౌరుషoగా స్టార్ట్ అయ్యింది పాత బైక్.

ప్రశాంత్ బైక్ పై స్పీడ్ గా వెళ్తున్నాడు కానీ అతని ఆలోచనలు మాత్రం వెనక్కి వెళ్లాయి.
……………………….

అవి ప్రశాంత్ లారెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదివే రోజులు,
కాలేజ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ ప్రశాంత్. ఫ్రెండ్స్ యూనియన్ అంటూ చలాకీగా జాలిగా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేశాడు. చివరి సంవత్సరం ఎగ్జామ్ పూర్తయ్యాయి.

కాలేజీలో సెండ్ ఆఫ్ పార్టీ జరుగుతుంది.
కాలేజ్ ప్రిన్సిపాల్ రామరాజు గారు మాట్లాడుతూ…

“డియర్ స్టూడెంట్స్, జీవితం ఒక ప్రవహించే నది లాంటిది. అది ఎక్కడికి దారి తీస్తుందో మనమే నిర్ణయించుకోవాలి. జీవితమనే ప్రవాహాన్ని ఎటుపడితే అటు కొట్టుకుపోకుండా ముందుచూపుతో దిశ, గమ్యం ఏర్పరుచుకోవాలి. చిన్న ఉద్యోగం దొరకగానే ‘ఇది చాలు లే’ అని దానితో సరిపెట్టుకోకుండా తనలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి తగిన కోర్సు నేర్చుకోవాలి, ఇప్పటి మీ నిర్ణయం వలన పది సంవత్సరాలు తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుందనేది ముందుగానే ఊహించుకొని ప్రణాళికాబద్ధంగా భవిష్యత్తుకు దారి ఏర్పరచుకోవాలి. లేదంటే జీవితo ప్రవాహంతో కొట్టుకుపోయి జలపాతంలో పడిపోతుంది.
ఈ తరహా జీవన విధానాన్ని అమెరికన్ రచయిత ఆంథోనీ రాబిన్స్ “నయాగరా సిండ్రోమ్” అన్నారు.”

చప్పట్లుతో హాలంతా మారుమోగిపోయింది. ఆయన మాటలు బాగా నాటుకున్నాయి ప్రశాంత్ బుర్రలో.

“నెక్స్ట్ నీ ప్లాన్ ఏంట్రా?” అన్నారు ఫ్రెండ్స్,

“రామ్ రాజ్ సార్ చెప్పింది 100% కరెక్ట్ రా. నేను ఇక్కడ ఆగిపోయి దొరికిన ఉద్యోగంతో సరిపెట్టుకోలేను, నాకు ఒక ఎయిమ్, అంబిషన్ ఉన్నాయి, పై చదువులకు అమెరికా వెళ్ళాలి, అక్కడే జాబ్ చూసుకుని సెటిలైయిన తర్వాత. అక్కడ సెటిలయిన అమ్మాయినే పెళ్లిచేసుకుంటాను.” అన్నాడు ఊహల్లో తేలిపోతూ.

తను అనుకున్నట్లే అమెరికా వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ప్రశాంత్.
………………….

హఠాత్తుగా ప్రశాంత్ తండ్రికి గుండెపోటు వచ్చింది ఆక్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు.

అప్పటివరకు ఫ్రెండ్స్ సినిమాలు షికార్లు అంటూ హుషారుగా తిరిగిన ప్రశాంత్ ఆయన చనిపోవడంతో ఊహలన్నీ తారుమారయ్యాయి.
అక్క పెళ్లికోసం చేసిన అప్పులు పెరిగి వడ్డీతో రెట్టింపు అయ్యాయి. ఇంటిమీద లోన్, తమ్ముడు చదువు, చెల్లి పెళ్లి బాధ్యత, ఎదుటి దారంతా సమస్యల సుడిగుండంలా కనిపించింది. తను అందులో చిక్కుకుపోయినట్లు అనిపించి కళ్ళుతిరిగాయి.

అప్పటికి ఉన్న ఒకే ఒక ఆసరా వారసత్వంగా గవర్నమెంట్ ఆఫీస్ లో తండ్రి చేస్తున్న చిన్న ఉద్యోగం.

చుట్టాలు బంధువులు వారసత్వపు ఉద్యోగంలో చేరమని పోరు పెట్టారు.

“నా ఆశలు ఆశయాలు వేరు, రెండు సంవత్సరాలు టైమ్ ఇవ్వండి. నేను మంచి ఉద్యోగం సంపాదిస్తాను, అప్పుడు అప్పులను తీర్చి, చెల్లి పెళ్లి చేసి తమ్ముడిని బాగా చదివిస్తాను.” అన్నాడు.

“నీ చదువు పూర్తయి ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, నీకు వచ్చే వారసత్వ ఉద్యోగం కూడా పోతుంది. వచ్చిన డబ్బులు అప్పులకు కూడా సరిపోవు, అప్పుల వడ్డీలు ఇంకా పెరిగిపోతాయి.” అన్నాడు ప్రశాంత్ బాబాయ్.

“అది కాదు బాబాయి ఈ ఉద్యోగంలో ఎదుగు బొదుగు వుండదు. తొందరపడి ఉద్యోగంలో చేరితే ఇరుక్కుపోవాలి. ఇంకా బాగా చదివి అవసరమైన కోర్సులు నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది.” అన్నాడు ప్రశాంత్.

“చూడు ప్రశాంత్ నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, నీకు గవర్నమెంట్ ఉద్యోగం విలువ తెలియట్లేదు హాయిగా కడుపులో నీళ్లు కదలకుండా కూర్చోవచ్చు, నెల వచ్చేసరికి జీతం డబ్బులు చేతిలో పడతాయి, అదే ప్రైవేట్ ఉద్యోగమైతే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వరు. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియదు.” అన్నాడు మేనమామ.

అలా అందరి బలవంతంతో ఇష్టం లేకుండానే తండ్రి గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరాడు ప్రశాంత్. అక్కడితో ఆగకుండా సంవత్సరం తిరగక్కుండా
పెళ్లి చేస్తే మంచిది అని మేనకోడలు సంధ్యతో పెళ్ళిచేసి ఉన్న బండకు మరో గుదిబండను ప్రశాంత్ భుజాలకు తగిలించి ఆనందపడ్డారు.

రెక్కలు కట్టుకుని అమెరికా ఎగరాలనుకున్న ప్రశాంత్ ఆశ ఆశయo, రెక్కలు తెగిన పక్షిలా నేలవాలాయి.

ఆలోచనలోనే తను ఉద్యోగం చేస్తున్న పోస్టాఫీసుకు చేరుకున్నాడు. తన పాత బైక్ని ఆఫీసు ముందు పెట్టీ పోస్టుమాస్టర్ కుర్చీల్లో కూర్చున్నాడు.

“ఛా! ఏసి రూమ్ లో కంప్యూటర్ల ముందు కూర్చవలసిన వాడు, ఈ పాతబిల్డింగ్ లో చెక్క కుర్చీలో కూర్చున్నాడు” అనుకున్నాడు చిరాగ్గా. నిస్సహాయత నిస్పృహలతో నిట్టూర్పు విడవటం కూడా ప్రశాంత్ దినచర్యలో భాగమయింది.
……………….

ప్రేమను పంచే మాతృమూర్తి, ఓర్పు సహనం కల భార్య, ముద్దుగారే పిల్లలు ప్రశాంత్కు ఊరట.

అధిక బాధ్యతల వలన గవర్నమెంట్ ఇచ్చే జీతం నెలల్లో సగం రోజులు కూడా రాదు. భార్య, తల్లి పొదుపుగా నెట్టుకొస్తున్నారు అప్పులు పాలవకుండా.

‘అప్పు చేయటం అంటే పామును సంచిలో పెట్టుకుని తిరగడమే ఎప్పుడు కాటేస్తుందో తెలియదు.’ అని తల్లి చెప్పిన మాటలు బాగా నాటుకున్నాయి.

ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడు ప్రశాంత్.
సంధ్య కూడా చుట్టుపక్కల వాళ్ళకి బ్లౌజులు డ్రెస్సులు కుడుతుంది. అటు ఇoటి పని, ఇటు మిషన్ కుట్టడంతో అలిసిపోతున్న సంధ్యను చూసి బాధనిపించేది.

ఫస్ట్ తారీకు వచ్చేసరికి. జీతంతో పాటు ట్యూషన్ ఫీజులు కలిపితే అక్కడికక్కడే సరిపోతుంది. దాని తోడు ప్రతి నెల పండగలు, పబ్బాలు రిపేర్ లు చుట్టాలు బంధువులు అని ఎక్స్ట్రా ఖర్చులు.

సంధ్య సహకారంతో నెట్టుకొస్తున్నారు సంసారాన్ని.

జీవితం అలా సాగిపోతున్నా “అనుకున్నది సాధించలేకపోయాను” అనే నిస్సహాయత, బాధ ప్రశాంత్ మనసుని తొలిచేస్తుoది.

ఎదురింటి అవినాష్ లాగా తను కూడా బంగ్లా, కారు, పిల్లలకు హైఫై లైఫ్ ఇవ్వాలంటే నేనేం చేయాలి? అనే ఆలోచనలతో చిరాకు పెరిగిపోయేది.

“అత్త మీద కోపం, దుత్త మీద చూపినట్లు” తన అసహాయతను భార్య మీద, పిల్లల మీద చూపిస్తూ గట్టిగా అరుస్తూ కోప్పడేవాడు.

ఒక్కోసారి కోపం మితిమీరితే సంధ్యను మేడపైకి తీసుకెళ్ళి కోపం అంతా వెళ్ళకక్కేవాడు.

పాపం సంధ్య నోటికి మాస్క్ వేసుకున్నట్లు మౌనంగా చేతులు కట్టుకుని మరి అతని కోపాన్ని భరించేది.
ఆమెకు తెలుసు – ప్రశాంత్ కోపం తాటాకు చప్పుడులాంటిదని.
……………….

“సార్” అని పిలూపు విని ఆలోచనలో నుంచి బయటకు వచ్చాడు ప్రశాంత్.

మీ చుట్టుపక్కల ఇళ్ళన్ని అపార్ట్మెంట్లు బంగ్లాలుగా మారాయి. మీదొక్కటే పాత పెంకుటిల్లు, మీ ఇంటిని కూడా డెవలప్మెంట్కి ఇవ్వoడి. మంచి బేరం ఉంది. అప్పట్నుంచి అడుగుతున్నారు.” అన్నాడు చంద్రం తను తెచ్చిన కవర్ను పోస్ట్ బాక్స్ లో వేస్తూ…

“చంద్రం! మీరు ఎన్నిసార్లు అడిగినా నాది ఒకటే సమాధానం. నాన్న కట్టించిన ఇంటిని డెవలప్మెంట్ కిచ్చి రెండు మూడు ఫ్లాట్లతో సరిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు కూడా టైం రాకపోతోందా? నా స్థలంలో నేనే నాకు నచ్చిన విధంగా ఇల్లు కట్టుకుంటాను” ఆనాడు ఖచ్చితంగా ప్రశాంత్.
…………………….

“చుట్టు అన్ని పెద్ద పెద్ద బంగాళాలు మన ఇల్లు దిష్టి చుక్కలా ఉంది. డెవలప్మెంట్ కి ఇవ్వచ్చు కదా” అంది సంధ్య.

“పోనీలే మనకు దిష్టి తగలదు” అని మాట దాటేసాడు.

‘ఆరోజు తను ఉద్యోగంలో ఇరుక్కోకుండా కొంత టైం తీసుకుని ఉంటే, ఇప్పటికి మంచి జాబ్ సంపాదించి ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉండేవాడు.
సంధ్యను మిషన్ కుట్టనిచ్చేవాడు కాదు, పిల్లల్ని కూడా మంచి స్కూల్లో వేసి చదివించేవాడు. మంచి ఇల్లు కట్టుకునేవాడు.
ఇప్పుడు ప్రవాహంతో పాటు కొట్టుకుపోతూ జలపాతంలోకి జారిపోవడం తప్ప తను చేయగలిగింది లేదు.’ అనుకున్నాడు బాధగా.

అప్పుడే ఎదురింటి అవినాష్ కొడుకు విరాజ్ స్పోర్ట్స్ బైక్ దూసుకు వచ్చి గేటు ముందు ఆపి హారన్ కొట్టాడు. వాచ్మెన్ పరుగున వచ్చి గేట్ తీశాడు.

‘ఎదురింటిని చూస్తే ప్రశాంత్ కు ఎప్పుడు ఒక అనుమానం, ఇల్లు పెద్దదే వెళ్లేటప్పుడు అందరూ ఆర్భాటంగా వెళ్తారు, కానీ వచ్చేటప్పుడు ఎవరి నచ్చిన టైంలో వాళ్ళు వస్తుంటారు. ఒకరికొకరు సంబంధం లేనట్లు ఉంటారు.’ అనుకున్నాడు

……………….

సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి,
ఇంటి బయట వరండాలో భగవద్గీత చదువుకుంటున్న సరస్వతమ్మ పక్కన కూర్చున్నాడు.

సంద్య తెచ్చిచ్చిన వేడి వేడి పకోడీలు తిని, టీ తాగుతూ,
మద్యమద్యలో ఎదురుగా ఉన్న పెద్ద బిల్డింగ్ ని అసహనంగా చూస్తూ, ట్యూషన్ పిల్లలు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ప్రశాంత్.

పక్కనే మిషన్ మీద అర్జెంటుగా ఇవ్వాల్సిన డ్రెస్ కుడుతుంది. సంధ్య.

మిషన్ సౌండ్కి చిరాగ్గా చూశాడు ప్రశాంత్.

అతని అసహనాన్ని చిరాకుని గమనించింది సరస్వతమ్మ,
“చూడు ప్రశాంత్ ‘పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం నయం’
మేడిపండు చూడటానికి ఎర్రగా నిగనగలాడుతూ ఉంటుంది. కానీ పొట్ట విప్పి చూస్తే కానీ తెలియదు లోపల ఎన్ని పురుగులు ఉంటాయో.
నువ్వు రోజు చూసే బంగళా, కార్లు పైకి కనిపించే బంగారు పూత మాత్రమే లోపల పరిస్థితి మనకు తెలియదు.” అంది.

ఇంతలో బయట పెద్ద గలాటా వినిపించిoది. పోలీస్ జీపులు వచ్చి ఎదురింటి ముందాగాయి. పోలీసులు గబగబా జీపులోంచి దిగి లోపలికి వెళ్లారు.

చుట్టుపక్కల వాళ్ళంతా ఇళ్లల్లోంచి బయటికి వచ్చి ఆత్రుతగా చూస్తున్నారు.

కొంతసేపటికి అవినాష్ కు బేడీలు వేసి తీసుకొని వచ్చి జీప్ లో ఎక్కించుకొని వెళ్ళిపోయారు పోలీసులు.

“సుబ్బారావుగారు ఏమైందండీ?” అని పిలిచాడు ప్రశాంత్.

“నీకు తెలియదా! అవినాష్ పెద్ద ఫ్రాడ్. కోట్లలో కుంభకోణం చేశాడు. ఇప్పుడా ఆస్తులు ఇల్లు అన్నీ కూడా సీజ్ చేసేస్తున్నారు. ఆస్తులు కూడబెట్టడానికి పరిగెడితే, ఉన్నది కూడా ఊడింది. భార్యాభర్తలు కూడా విడాకులు తీసుకున్నారoట. పిల్లలు చదువు సంధ్య లేకుండా పబ్బులు పార్టీలని తిరుగుతూ ఉంటారు. ఎంత సంపాదించి ఏమి లాభం, ఆస్తి, పరువుపోయి రోడ్డున పడ్డారు. ఏంటో ఈ మనుషులు” అనుకుంటూ వెళ్ళిపోయాడు సుబ్బారావు.

తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
తల్లి చేయి పట్టుకుని లోపలికి నడిచాడు ప్రశాంత్.

‘ఎప్పుడో తను తీసుకున్న నిర్ణయానికి నూన్యత భావంతో ఇప్పుడు కూడా బాధపడుతూ ఇంట్లో వాళ్ళనూ బాధపెడుతున్నాడు. ఆస్తి అంతస్తులు కన్నా మనశ్శాంతి ముఖ్యం అనుకున్నాడు.

తల్లి, సంధ్య, పిల్లలు తన చుట్టూ కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్తుంటే, ప్రశాంత్ హృదయం ఆనందంతో నిండిపోయింది.
“ఇదే నా నిజమైన సంపద… నాకు వీళ్ళు ఉన్నంతకాలం నేనే నిజమైన కోటీశ్వరుడిని” అని అనుకున్నాడు.

తన చిన్న పెంకుటిల్లు అందమైన ‘ఆశలపల్లకిలా’ కనిపించింది.

………సమాప్తం……….