*****
*నాన్ స్టాప్ స్టాపులు*
=============
(మినీ హాస్య కథ)
రచన :: బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.
"సార్, నేను రాబోయే ఊర్లో దిగాలి. అక్కడ బస్సుని స్టాపమంటే స్టాపుతారా ??" తోటి ప్రయాణికుడిని అడిగాడు ఆగమరావు.
"అబ్బే, అలా ఎక్కడ పడితే అక్కడ స్టాపరండీ !" చెప్పాడాయన.
"మరి, అక్కడ బస్సుని స్టాపలంటే ఏం చేయాలి ?"
"కొంచెం స్టాపమని కండక్టర్ని రిక్వెస్ట్ చేయండి"
"కండక్టర్ గారూ, బస్సు కొంచెం స్టాపండీ, దిగి పోతా !!"
"ఇక్కడ స్టాపకూడదండీ !!"
"స్టాపమని రిక్వెస్ట్ చేస్తున్నానుగా ??"
"అసలు ఇక్కడ రిక్వెస్ట్ స్టాపే లేదుగా ?"
"మరి ఎక్కడ స్టాపుతారు ?"
"స్టాపుల్లోనే స్టాపుతాం !!"
"సార్, మరి ఇక్కడ బస్సుని స్టాపలంటే ఏం చేయాలి ?"
"కొంచెం స్టాపమని డ్రైవర్ ని రిక్వెస్ట్ చేయండి"
"డ్రైవర్ గారూ, బస్సు కొంచెం స్టాపండీ, ఇక్కడ దిగి పోతా !"
"ఇక్కడ స్టాపకూడదు. స్టాపుల్లోనే స్టాపుతా"
"ఇలా రిక్వెస్ట్ చేసినా కానీ స్టాపరా ? "
"స్టాపడానికి ఇక్కడ రిక్వెస్ట్ స్టాపే లేదుగా"
"మీ స్టాఫ్ కయితే స్టాపు లేకపోయినా స్టాపుతారు. మాకైతే స్టాపరా ?"
"ఛ..స్....స్టాపండెహే....ఇందాకట్నించి చస్తున్నాం, మీ స్టాపుల గోల వినలేక" అరిచాడు ఓ ప్రయాణికుడు.
"అవునండీ, మరీ నాన్ స్టాపుగా వాయించేస్తున్నారు !" రెండవ ప్రయాణికుడు.
"ఇప్పటికైనా మీ స్టాపులకు కొంచెం పులు స్టాపు పెట్టండి బాబూ !"మూడవ ప్రయాణికుడు.
"ఏమర్రోయ్ నా మాట విని, మీ స్టాపుల గోల స్టాపుతారా...లేకపోతే స్టాపు లేకపోయినా తర్వాత స్టాపులో దూకేయమంటారా??" విసుక్కున్నాడు కండక్టర్.
"నువ్వు స్టాపమన్నావు కాబట్టి స్టాపుతున్నాను కానీ , లేకపోతే అసలు స్టాపకేపోదును" అంటూ బస్సును అక్కడ స్టాపు లేకపోయినా స్టాపేడు డ్రైవర్.
"స్టాపేడు కదా దిగండి" విసుగ్గా చెప్పాడు కండక్టర్.
"నేను స్టాపమన్న చోట కాకుండా వేరే చోట స్టాపితే నేనెందుకు దిగుతాను ?"
"మరెక్కడ స్టాపమంటారు ?"
"ఇంకెక్కడ ? నెక్స్ట్ స్టాపులో !!" నింపాదిగా చెప్పాడు ఆగమరావు.
"ఆ........."
***** శుభం******
(నేను రాసిన ఈ హాస్య కథ జనవరి, 2019లో హాస్యానందం అనే మాసపత్రికలో ప్రచురితమైనది)