దత్తత

ముల్కనూరు ప్రజా గ్రంధాలయం మరియు నమస్తే తెలంగాణా దిన పత్రిక సంయుక్తంగా నిర్వహించిన 2025 కథల పోటీలో 3000 రూపాయల బహుమతి పొందిన కథ. మరియు నమస్తే తెలంగాణా దిన పత్రిక ఆదివారం ప్రత్యేక అనుబంధం బతుకమ్మ లో 01-03-2026 న ప్రచుర • 01 Mar 2026 • 👁 5 views
ఆర్కిటెక్ట్ అయిన నేను కొత్తగా కట్టబోయే అపార్టుమెంట్ డిజైన్ బ్లూప్రింట్ తయారుచేయడానికి చాలా సీరియస్ గా పని చేసుకుంటున్నాను. ఫోన్ మోగడంతో విసుగ్గాచూశా. అమ్మ అని కనిపించింది. వెంటనే ఫోన్ ఎత్తి హలో అన్నా. సార్, అమ్మగారు ఉన్నట్టుండి గుండె దగ్గర చెయ్యి పెట్టుకుని నొప్పి… నొప్పి… అని భాథ పడుతున్నారు, మీరు త్వరగా ఇంటికి రండి, చెప్పింది పనిమనిషి. సరే, వెంటనే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి అంబులెన్సుకి ఫోన్ చేసా. అంబులెన్సు వచ్చేలోగా కారులో వేగంగా ఇంటికి చేరుకొన్నా.
వెళ్లేసరికి అమ్మ కింద పడుకుని నొప్పితో విలవిల లాడుతోంది. గబ గబా దగ్గరికి వెళ్లి ఏమైందమ్మా? అని అడిగాను. గుండెల్లో నొప్పిగా ఉంది అంది ముద్దముద్దగా భాథ పడుతూ. ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. వెంటనే ఆమెను పని మనిషి సహాయంతో గదిలోకి మార్చా. ఫ్యాన్ కూడా వేసి, ఆమెకు ధారాళంగా గాలి ఆడేలాచేసి, ఒక గ్లాసులో నీళ్లు తెచ్చి తాగించాను, ఆమె ఎక్కువ తాగలేక పోయింది. ఆమెకు పట్టిన చెమటల్ని నాకర్చీఫ్ తో తుడుస్తూ, సపర్యలు చేస్తూ పక్కనే కూర్చున్నాను.
ఈలోగా అంబులెన్సు రావడంతో అందులో ఎక్కించి హాస్పిటల్ కి తీసుకెళ్లా. హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఐ.సి.యూకి చేర్చారు. డాక్టర్ వచ్చి ఇ.సి.జి తీసి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పి, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్ పై ఉంచారు. వెంటనే బైపాస్ ఆపరేషన్ చెయ్యాలని కొంత డబ్బు డిపాజిట్ చెయ్యమని చెప్పారు. అలాగే అని కొంత డబ్బు కట్టి వచ్చాను. వాళ్ళు ఆపరేషన్ చేసే లోపే అమ్మ చనిపోయింది.
భార్య శ్రీలతకి విషయం ఫోన్ చేసి చెప్పమని ఓ నర్స్ కి చెప్పడంతో ఆమె చెప్పింది. హాస్పిటల్ వాళ్ళు శవాన్ని తీసుకెళ్లమని చెప్పడంతో, మార్చురీ వ్యాన్ కోసం ఎదురుచూస్తున్నాను. శ్రీ లత ఆఫీస్ నుండి వస్తూ ఆరేళ్ళ కొడుకు దేవాన్ష్ ని స్కూల్ కి వెళ్లి తీసుకుని తీసుకొచ్చింది. వస్తూనే, అడిగాడు నాయనమ్మకు ఏమైంది అని. హార్ట్….. అటాక్ అన్నా ఏడుస్తూ, భాథగా. నాగొంతు దుఃఖంతో పూడుకుపోయింది. భుజం చుట్టూ చేతులేసి నన్ను హత్తుకున్నాడు సానుభూతిగా. భాథ పడకండి, అంది భుజం పై చెయ్యి వేసి ఓదార్పుగా భార్య.
అమ్మ శవాన్ని తీసుకుని ఇంటికి వచ్చాను. ఉదయం ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు నాన్న అని చెప్పిన అమ్మ సాయంత్రం ఇంటికి శవమై వచ్చింది. పక్కింటి వాళ్ళు వస్తే, ఎవరెవరికి చెప్పాలో చెప్పి అందరికి చెప్పమని, అమ్మ డైరీలో కొన్ని ఫోన్ నంబర్లున్నాయి వాళ్ళకు కూడా చెప్పండి అని చెప్పాను. వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. అమ్మ శవాన్ని ఏ. సి బాక్స్ లో పెట్టించి ఇంటిముందు టెంట్ వేయించాను. ఆమె తల దగ్గరే కుర్చీ వేసుకు కూర్చున్నాను. ఆమె ముఖం వైపు చూశాను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉంది ఆమె మొహం. ప్రశాంతమైన నిద్ర అంటే మరణమేనేమో అని నాకు అనిపించింది.
రాత్రి ఏడు గంటలయింది. నా ఆఫీస్ స్నేహితుడు ఉమేష్ వచ్చాడు. ఓ జోక్ చెప్పి నన్ను నవ్వించి, ఆ భాథలోనుండి బయటపడేసే ప్రయత్నం చేశాడు. వాడి జోక్ విని నిర్లిప్తంగా నవ్వాను. ఆ నవ్వులో ఎటువంటి జీవం లేదు. లావాలా ఉబికి వస్తున్న భాథ తప్ప. కొద్దిసేపు నాపక్కన కూర్చొని వెళ్ళిపోయాడు. నాభార్య భోజనం చెయ్యమని చెప్పింది. తినాలనిపించలేదు వద్దని చెప్పాను. అర్ధం చేసుకుని వెళ్ళిపోయింది.
పది గంటలయ్యింది. ఒకతను వచ్చి అమ్మను కాసేపు చూసి నీతో మాట్లాడాలి కొంచెం పక్కకి వస్తావా అన్నాడు. ఎందుకు? అన్నట్టుగా చూసాను అతనివైపు. చెప్తాను రా అన్నాడు అభ్యర్ధనగా. డిసెంబర్ నెల కావడంతో కాస్త చలిగా ఉంది. ఇంటి గేటు వరకు వెళ్లి, ముందున్న రోడ్డు వైపు చూసాను. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది, పెద్దగా జనసంచారం లేదు. ఉరుకుల పరుగులతో, యంత్రంలా పరిగెత్తే ఈ ప్రపంచం విశ్రాంతి తీసుకుంటుందేమో అనిపించింది. అతనివైపు చూసి, చెప్పండి అన్నాను. మీ అమ్మను నేను ప్రేమించాను, ఆమె అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అతనివైపు విచిత్రంగా, అనుమానంగా చూశాను. ఇదేoటి? ఇప్పుడొచ్చి నాకు చెప్తున్నాడు, అందులోనూ చనిపోయాక అన్న అనుమానం నా మనసులో మెదిలింది.
అలా నావైపు చూడకు నేనెవరో, మీ అమ్మకు నాకు ఎలాపరిచయమో చెప్తాను విను అన్నాడు. నాపేరు యుగంధర్. మీ నాన్న, నేను మంచి స్నేహితులం. రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పని చేసే వాళ్ళం. విజయవాడ రైల్వేస్టేషన్ లో మాఆఫీస్ ఉండేది. రోజూ కలుసుకునేవాళ్ళం. పనిలో ఒకరికొకరo సహాయం చేసుకునే వాళ్ళం. అప్పుడప్పుడు నేను నాభార్యతో మీ ఇంటికి, మీ అమ్మ, నాన్న మాఇంటికి వచ్చేవాళ్లు. ఆవిధంగానే మీ అమ్మకు నాకు పరిచయం ఏర్పడింది. నువ్వు పుట్టిన మూడునెలలకి ఓ రైలు ప్రమాదంలో మీనాన్న చనిపోయాడు. మీ అమ్మ అప్పటికే టైపింగ్ హయ్యర్ గ్రేడ్ పూర్తిచేయడంతో మీ నాన్నగారికి బదులు ఆమెకి టికెట్ బుకింగ్ క్లర్క్ గా ఉద్యోగం ఇచ్చారు. నాభార్యకు, నాకు మనస్పర్ధలు రావడంతో గొడవపడి విడిపోయాం.
ఇంతకుముందున్న పరిచయంతో కలిసినప్పుడల్లా మాట్లాడే వాడిని. ఆ పరిచయం మీ అమ్మ మీద ఇష్టం గా మారింది. ఓరోజు కలిసినప్పుడు పెళ్లిచేసుకుందామని అడిగాను. ఆమె ఒప్పుకోలేదు. మా స్టేషన్ మేనేజర్ చేత కూడా చెప్పించాను ఆమె ససేమిరా అంది. ఇంటికెళ్లి సావధానంగా మాట్లాడదామని ఓరోజు మీ ఇంటికొచ్చా.
ఇంట్లో నువ్వు, మీ అమ్మ తప్ప ఎవరూలేరు. నువ్వు పాక్కుంటూ ఆడుకుంటున్నావు. మీ అమ్మ వంటగదిలో అటు తిరిగి వంకాయలు కోస్తుంది. నేను సరా సరి వంటగలోకి వెళ్లి మీ అమ్మను పలకరించాను. ఆలా వెళ్లడoతో ఆమెకు నాపై బాగా కోపం వచ్చింది. ఒక్కసారిగా నాపై చేతిలోని కూరగాయలు కోసే కత్తితో విరుచుకుపడింది. బయటకు వెళ్ళు అని పెద్దగా అరుస్తూ, చేతిలోని కత్తితో ఏటవాలుగా పైనుండి కిందికి తిప్పింది. అకత్తి నా చెంపకు తగిలి చీరుకు పోయింది. ఇదే ఆ మచ్చ అని నాకు చెంపను చూపించాడు. అతని చెంపపై గీసుకు పోయిన మచ్చ కనబడింది. భయపడి బయటకు వచ్చేసాను. మీ అమ్మ అరుపులకు చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు వచ్చారు. ఇక అక్కడ ఉండలేక వెళ్లిపోయాను.
ఆ తర్వాత రైల్వేస్టేషన్ లో ఎక్కడైనా కనిపించినా, నేను పలకరించినా నాతో మాట్లాడటం మానేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు నాకు ట్రాన్స్ ఫర్ అయ్యి ఈ ఊరొచ్చి, రిటైర్ అయ్యి ఇక్కడే స్థిరపడ్డాను. ఏడాది క్రితం అనుకోకుండా ఓ ఫంక్షన్ లో కలిసాం, నేను క్షమాపణ చెప్పి మీ అమ్మకు నంబర్ ఇచ్చాను అన్నాడు.
మరి మా అమ్మకి మీమీద కోపం తగ్గిందా? అడిగాను. ఆవిషయం నాకు తెలియదు, క్షమాపణ ఐతే చెప్పాను. మళ్ళీ పెళ్లి గురించి మీరు మాట్లాడలేదా అని అడుగుదామనుకున్నాను, కానీ హేళన చేసినట్టుగా ఉంటుందని ఊరుకున్నాను. సరే ఆలస్యమౌతుంది వెళ్ళి, మళ్ళీ రేపు వస్తాను అన్నాడు.
మీరెక్కడ ఉంటారు అడిగాను. లక్ష్మిపురం చెప్పాడు. అతను వెళ్ళిపోగానే తిరిగి వచ్చి అమ్మ తలదగ్గరే ఉన్న అదే కుర్చీలో కూర్చున్నాను. పన్నెoడు గంటల తర్వాత బాగా పొద్దు పోయింది, అత్తయ్య దగ్గర నేను కూర్చుంటాను మీరు వెళ్లి పడుకోండి అంది నా భార్య వచ్చి. లేదు నువ్వెళ్ళి పడుకో అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. రేపటి నుండి అమ్మ లేదు అనే ఊహే నాకు చాలాభయాన్ని, దిగమింగుకోలేని బాధని కలిగిస్తుoది. భార్య, కొడుకు, స్నేహితులు ఉన్నా ఈప్రపంచంలో ఒంటరినై, ఏకాకిగా మిగిలిపోయాననిపిస్తుంది.
తెల్లవార్లు అలాగే కూర్చున్నాను. కళ్ళు ఎర్రబడ్డాయి నిద్రలేమితో. ప్రతి రాత్రీ వెళ్ళుపోతూ వీడ్కోలుగా ఒక ఉదయాన్నిస్తుంది! ఆ ఉదయం కొంతమందికి సంతోషాన్ని మరికొంతమందికి దుఃఖాన్ని తీసుకొస్తుంది. కానీ ఈఉదయం మాత్రం నాకు అంతులేని విషాదాన్ని తీసుకొచ్చింది. తెల్లవారింతర్వాత ఇంకా కొంతమంది వచ్చారు అమ్మని చూడడానికి. ఎనిమిది గంటలయింది. ఒకామె వచ్చి నాపక్కనే కుర్చీవేసుకు కూర్చుంది. కాసేపు అమ్మవైపు తదేకంగా చూసి భాధపడింది. నావైపు తిరిగి నాపేరు యశోద బాబు, మీ అమ్మ నేను చిన్ననాటి స్నేహితులం. ఇద్దరిదీ ఒకే ఊరు. ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం.
చిన్నప్పుడు మీ అమ్మ ఎంత చలాకీగా, హుషారుగా ఉండేదో. మాఊరి బయట చింతచెట్ల తోపు ఉండేది. కోతి కంటే వేగంగా ఏ మాత్రం భయం, బెదురు లేకుండా చెట్టెక్కి చింత చిగురు కోసేది. మీ అమ్మకి చింత చిగురు పప్పు అంటే చాలా ఇష్టం. ఇద్దరం తొక్కుడు బిళ్ళ, అష్టాచెమ్మ ఆడుకునేవాళ్ళం, సరదాగా సైకిల్ పందాలు పెట్టుకునేవాళ్ళం. నాకంటే ఎంతో వేగంగా తొక్కేది, నేనెప్పుడూ గెలిచింది లేదు. ఇంటర్ తర్వాత నాకు పెళ్లయింది. మీ అమ్మ డిగ్రీలో చేరింది. అక్కడే మీనాన్నతో పరిచయం అయ్యిందని, ప్రేమిoచుకున్నారని, ఇద్దరి కులాలు వేరుకావడంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని వదిలేసివెళ్లి పెళ్లిచేసుకుందని విన్నాను.
మా అబ్బాయి ఈ ఊర్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. వాడితోపాటే ఇక్కడే ఉంటున్నాను. రెండు నెలల క్రితం రైతు బజార్లో కనబడితే తనే గుర్తుబట్టి పలకరించింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవడంతో ఎంతో సంతోషపడ్డాం. ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదు అoది.
అమ్మ బాల్యంలో ఎంత సంతోషంగా గడిపిందో ఆమె మాటల్లోనే తెలిసిపోతోంది. ఇప్పటి పిల్లలకి అంత స్వేచ్ఛ, సంతోషం ఎక్కడున్నాయి. గాడిదల్లా పుస్తకాల బరువు మోస్తూ ర్యాంకుల కోసం కుస్తీ పడటం పడటం తప్ప. నాకొడుకుని చూస్తే జాలి వేసింది. నేను వెళ్తాను బాబు నాలుగు రోజులనుండి జ్వరం. తప్పనిసరై మందులు వేసుకుని వచ్చాను అoది. సరే అన్నాను, ఆమె వెళ్ళిపోయింది.
మధ్యాహ్నం తర్వాత ఖట్టిక తయారు చేశారు. అమ్మని సిధ్ధం చేసుకుని, స్మశానానికి తీసుకెళ్లడానికి ముందు నేను నిప్పుకుండతో నావెనక నలుగురు అమ్మని మోసుకొస్తూ వాళ్ళవెనక మిగతావాళ్ళం బయల్దేరాం. అమ్మ వెళ్లిపోవడం ఆకాశానికి ఇష్టం లేనట్లుంది, సన్నగా ఏడుస్తుంది. కట్టెలు పేర్చి చితికి నిప్పంటిoచా. నాన్న చనిపోయినతర్వాత నా కోసమే ఒంటరిగా బ్రతికి, కష్టపడి పనిచేసి రూపాయి రూపాయి కూడబెట్టి నన్ను అమెరికా పంపించి మరి చదివించి ఇంతవాణ్ణి చేసి ఆ కట్టెల్లో ఓ కట్టెగా కాలిపోయింది. ఆమెతో పాటు ఆమె కష్టాలు, కన్నీళ్లు కూడా.
అందరూ వెళ్లిపోయారు. కుండలో చితాభస్మం తీసుకుని బయలుదేరుతుండగా కొద్ధి దూరంలో యుగంధర్ నిలబడి ఉన్నాడు. ఎప్పుడొచ్చారు? అని అడిగాను. నీ వెనకే జనంతో పాటే వచ్చాను అన్నాడు. ఆయన ముఖంలో భాథ, దుఃఖం కనిపించాయి. నాతో పాటే ఇంటివరకు వచ్చాడు. నా ప్రేమను అంగీకరించక పోవడానికి కారణం నీ మీద ఉన్న ప్రేమ, నీ భవిష్యత్తు భవిష్యత్తు గురించిన ఆలోచన కారణం అయి ఉండొచ్చు అని నేను వెళ్ళొస్తాను అని బయల్దేరాడు. సరే అన్నాను. నాకూ అలాగే అనిపించింది, నా భవిష్యత్తు కోసం అమ్మ తన జీవితాన్నే త్యాగం చేసింది. అతను కనిపించినంత మేర అతన్నే చూస్తూ ఉండి పోయాను.
టెంటు, కుర్చీలు అన్ని సర్దేసి అంతా పూర్తయ్యే సరికి సాయంత్రమైంది. వంట పూర్తి చేసి రెండురోజుల్నుండి ఏమీ తినలేదు, భాథ పడటానికైనా ఓపికఉండాలి కదా ముఖం కడుక్కుని తినండి అని నా భార్య అనడంతో బ్రష్, స్నానం చేసి కొంచెం తిన్నాను.
రాత్రయ్యాక పడుకున్నా, నిద్రపట్టలేదు. కొడుకుని నిద్రపుచ్చి నాదగ్గరకొచ్చి ఏంటి ఇంకా పడుకోలేదా? అడిగింది భార్య. నిద్ర రావడం లేదని చెప్పాను. మనతో ఉండే ప్రతిమనిషికీ చివరి రోజంటూ ఒకటుంటుంది. వాళ్ళు చనిపొతే మనజీవితంలోనుండి వెళ్లి పోతారు, వాళ్ళతో పాటు వాళ్ళు పోషించిన పాత్ర కూడా వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉంటాయి. వాటినే తలుచుకుంటూ బాధపడితే జీవితం ముందుకు సాగదు.
మనిషి జీవితం ఒక నదీ ప్రవాహం లాంటిది. అది ఎప్పుడు ముందుకే సాగుతుందే కానీ వెనక్కి రాదు. ఆ ప్రవాహానికి ఏదయినా అడ్డొస్తే వాటిని తొలగించుకుని వెళుతుంది ఆలా వీలుకాకపోతే పక్కగా ప్రవహిస్తోంది. మనిషి జీవితం కూడా అంతే ఏదయినా జరగరానిది జరిగితే తప్పుకొని ముందుకు వెళ్లాలేతప్ప అక్కడే ఆగిపోకూడదు. జరిగినదాని గురించే ఆలోచిస్తే భాథ తప్ప ఏమీ మిగలదు. ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి అనినన్ను పడుకోబెట్టింది.
మనిషి మరణిస్తే కలిగే భాథ ఇదే మొదటిసారి అనుభవం, అందులోనూ కన్నతల్లి మరణం.
అప్పుడే ఎక్కడో చదివిన ఓ కవిత గుర్తుకొచ్చింది.
మరణం కాలం విసిరేసిన ఓ విధి
ప్రతి మనిషి చివరిమజిలీ
మనుషుల్ని విడదీసేందుకు ఏ కొలిమిలోను, ప్రయోగ శాలలోను తయారుచెయ్యని ఓ ఆయుధం
ఏ మనిషి అడ్డుకోలేని, ఆపలేని ఓ సంఘటన
పాత్ర ముగిసిన జీవితాల్ని కనుమరుగు చేసే ఓ ఇంద్రజాలం
బతికున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళను తలుచుకుని, గుర్తుచేసుకుని
భాథపడే ఓ అవస్థ.
జీవితం, బంధాలు అశాశ్వితం మరణమే శాశ్వతం.
ఉదయం నిద్ర లేచాను. అమ్మ జ్ఞాపకం వస్తుండటంతో ఇంట్లో ఉండబుద్ది కాలేదు. తయారయ్యి ఆఫీస్ కి వెళ్ళాను. అందరు నావైపు ఆశ్చర్యంగా చూసారు. మొన్ననే అమ్మ చనిపోతే అప్పుడే వచ్చాడేంటి అని. ఏంట్రా అప్పుడే వచ్చేసావ్? కొన్ని రోజులు సెలవు తీసుకోవచ్చుగా అన్నాడు ఉమేష్. ఇంట్లో ఉంటే అమ్మ గుర్తొస్తుందని, ఉండబుద్ది కాక వచ్చానని చెప్పాను. సాయంత్రం వరకు పనిచేసాను. అందరూ ఇంటికి వెళ్లిపోతుంటే నేనూ బయల్దేరాను, కానీ వెళ్ళబుద్ధి కాలేదు. ఓ పార్కులోకెళ్ళి సిమెంట్ బెంచి మీద కూర్చున్నాను.
నాకెదురుగా ఇద్దరు దంపతులు వాళ్లతో పాటు వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. ఆ పిల్లాడి వయసు ఇంచుమించు నా కొడుకు వయసే ఉంటుంది. వాళ్ళనాన్న సెల్ ఫోన్ లో పాటలుపెడితే అందులోనుండి వచ్చే సంగీతానికి అనుగుణంగా సంతోషంతో డాన్స్ చేస్తున్నాడు, వాళ్ళమ్మ చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తోంది. నాపెదాలపై చిరునవ్వు మొలిచింది. నాజీవితంలో అలాంటి సంఘటన జరగలేదు. ఇక ముందు జరిగే అవకాశం కూడా లేదు. పెదాలు బిగుసుకు పోయాయి. అతి కష్టం మీద నా భావోద్వేగాల్ని అదుపు చేసుకున్నాను.
నా భార్య ఫోన్ చేసి ఎక్కడున్నారు, చీకటి పడే వేళయింది, త్వరగా ఇంటికి రండి అంది. సరే అని ఫోన్ పెట్టేసి ఇంటికెళ్ళాను. తర్వాతి రోజు యధాలాపంగా ఆఫీస్ కి బయల్దేరాను. అన్నా! ముగ్గు తోక్కేస్తున్నారు పక్కకి వెళ్ళండి అని కేకేసింది పక్కింటి అమ్మాయి. కింద చూస్తే పేద్ద ముగ్గు వాళ్ళింటి ముందునుండి మా ఇంటి వరకు వేసిఉంది. చప్పున పక్కకెళ్లి ఏంటి ఇంత పెద్ద ముగ్గు వేశావు? అడిగాను ఆ అమ్మాయిని. సంక్రాతి నెల ప్రారంభమయ్యిందిగా అందుకే…. అంది చిరునవ్వుతో. మా ఇంటి వైపు చూశాను, ఇల్లంతా, కళా విహీనంగా, బోసిపోయివుంది, అక్కడక్కడా రంగువెలిసిపోయి, మరికొన్ని చోట్ల చిన్న చిన్న పెచ్చులూడిపోయి.
అమ్మకి సంక్రాతి పండగ అంటే ఎంతో ఇష్టం. పండగ నెల ప్రారంభమయ్యిందంటే ఇల్లంతా శుభ్రం చేసి పాతసామాను స్టోర్ రూంలో పెడుతుంది భోగి రోజు కోసం. ఇంటికి చిన్న, చిన్న మరమ్మత్తులుంటే చేయించి, రంగులు వేయిస్తుంది. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి, గడపకి పసుపు పూసేది. ఇంటిముందు చుక్కలతో ముగ్గులేసి మధ్యలో గొబ్బెమ్మలుపెట్టేది. ఇల్లంతా పండగ కళని సంతరించుకునేది. గంగిరెద్దుల వాళ్ళు, హరిదాసులు వస్తే ఎప్పుడూ వట్టిచేత్తో పంపేది కాదు. కొత్తబట్టలు కొనిపెట్టేది, పండగ రోజు చేసే చక్కర పొంగలి అంటే నాకెంతో ఇష్టం.
ఆ ఆలోచనలతోనే ఆఫీస్ కి చేరుకున్నాను. రోజూ వెళ్లి పనిలో నిమగ్నమవ్వడంతో కొద్ది కొద్దిగా సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నాను. పండగ కూడా వెళ్ళిపోయింది.
రెండు నెలలు గడిచాయి. ఆఫీస్ కి టైంఅవ్వడంతో హడావిడిగా బయల్దేరుతున్నాను. సాయంత్రం త్వరగా రండి! షాపింగ్ కి వెళ్ళాలి అంది నాభార్య. ఎందుకు? అడిగాను. ఎల్లుండి నా హ్యాపీ బర్త్ డే, కొత్త బట్టలు కావాలి అన్నాడు నాకొడుకు దేవాన్ష్. సరే అని వెళ్ళిపోయాను. సాయంత్రం వెళ్లొచ్చాక ఈసారి అబ్బాయి పుట్టిన రోజు ఎక్కడ చేద్దాం అడిగింది నా భార్య. ప్రతి సంవత్సరం నా కొడుకు పుట్టిన రోజు ఏదయినా అనాధ ఆశ్రమంకి వెళ్లి అక్కడి పిల్లలకి స్వీట్లు, పళ్ళు పంచి పెట్టడం చేస్తాం, అందుకే ఆలా అడిగింది. కొద్దిసేపు అలోచించి ఈసారి ఏదయినా వృద్ధాశ్రమంలో చేద్దాం అన్నాను.
రెండు క్షణాలు నావైపు చూసి సరే మీ ఇష్టం అంది. నాకు తెలిసిన వాళ్లద్వారా ఓ వృద్ధాశ్రమం వివరాలు కనుక్కుని అక్కడికి వెళ్లి నా కొడుకు పుట్టినరోజు జరపాలని నిర్ణయించుకున్నాను. ఆశ్రమ నిర్వాహకుడు ప్రభాకర్ తో ముందుగానే మాట్లాడి అన్ని వివరాలు తెలియజేశాను. ఆయన అంగీకరించాడు. పుట్టినరోజు నాడు మావాడు, నేను, నాభార్య కొత్త బట్టలు వేసుకుని, స్వీట్లు, అరటికాయలు, యాపిల్స్ తీసుకుని వృద్ధాశ్రమంకి వెళ్ళాం. ప్రభాకర్ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు.

ముందుగా మావాడి చేత కేక్ కట్ చేయించి, అందరికి వాడిచేత స్వీట్లు, పళ్ళు ఇప్పిస్తున్నాను. కొద్ది దూరంలో అమ్మ కనిపించింది. మా వాడ్ని, వాడి చేతిలోని పళ్ళు వదిలేసి అమ్మా.... అంటూ ఆమె దగ్గరికి పరిగెత్తాను. అందరూ నా వైపు ఆశ్చర్యంగా చూసారు. ఆమె మీ అమ్మకాదు అంది ఆమె పక్కన కూర్చున్న ఓ వృద్దురాలు. మీ ఆమ్మ గారు చనిపోయారటగా అన్నారెవరో వెనకనుండి. కొన్నిక్షణాలు నా మెదడు మొద్దుబారి పోయిoది. అమాంతం పేద్దలోతయిన అగాధపులోయలోకి జారిపడిపోయినట్టు అనిపించింది నాకు. అక్కడనించి దూరంగా పరుగెత్తి పేద్దగా అమ్మా.... అని అరిచి ఏడవాలనిపించింది. నాకళ్ళనుండి రెoడు కన్నీటి బొట్లు జల జలా రాలాయి నా ప్రమేయం లేకుండానే. ఏమైంది బాబు అని ఆమె నా దగ్గరికి వచ్చి, నా కన్నీళ్లు తుడిచి, నా పేరు వసుంధర, మీ అమ్మను కాదు అంది. సార్, ఆమె భర్త రెండేళ్ల క్రితం చనిపోయారు, పిల్లలు లేరు. అప్పటినుండి ఈ ఆశ్రమంలో అనాధగా ఉంటోంది అన్నాడు ప్రభాకర్ వెనకనుండి.
ఆమె వైపు చూసాను. అవును ఆమె మా అమ్మకాదు, కానీ ఆమ్మ పోలికలు మాత్రం ఉన్నాయి. కళ్ళు, ముక్కు అచ్చం అమ్మ లాగానే ఉన్నాయి. అదే రంగు, అమ్మకంటే ఒకటి రొండేళ్లు ఎక్కువ వయసు ఉండొచ్చు. అమ్మకంటే ఓ రెoడంగుళాలు ఎత్తు తక్కువ కూడా. కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుని నా కొడుకుని పిలిచి ఆమెకు పళ్ళు నేనే నాచేతులతో ఇచ్చాను. నా కొడుకు ఆమెను చూసి ఎవరీమె నానమ్మలా ఉంది అన్నాడు. నానమ్మకాదు, అని మిగతా వాళ్లకు పళ్ళిప్పించాను. అక్కడ ఉన్నంత సేపు ఆమెతో మళ్ళీ మళ్ళీ మాట్లాడాను. అమ్మ…. అని పిలిచాను. తిరిగి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పాను.
ఆమె జాగ్రత్తగా వెళ్లండని చెప్పింది.
రాత్రి భోజనం చేసి పడుకుని ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంకా పడుకోకుండా అంది నా భార్య వచ్చి. వసుంధర గార్ని దత్తత తీసుకుందామనుకుంటున్నాను అన్నాను. నిజంగానా? అడిగింది. అవును అన్నాను. ఆమె ఆలోచనలో పడింది. ఏంటి ఆలోచిస్తున్నావు? అన్నాను. అత్తయ్య చాలా మంచివారు. అప్పుడప్పుడు మా ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు తప్ప గొడవలేం లేవు. కానీ వచ్చే ఆవిడ ఎలావుంటుందో….. అని అంది. ఆమె గురించి పూర్తిగా తెలియకుండా అలా ఆలోచించకు, ఆవిడతో కలిసిపో అన్నాను. సరే, ఎవరూలేని అనాధ, మనతో కలిసుంటానంటే దత్తత తీసుకోండి అంది. ఉదయాన్నే ప్రభాకర్ గారితో ఫోన్ చేసి మాట్లాడాను. ఆమెను అడగండి, ఆమె ఒప్పుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు అన్నాడు.
ఆఫీస్ కి సెలవు పెట్టి వెళ్లి వసుంధర గారిని కలిసాను. ఆమెతో విషయం చెప్పి కన్న తల్లిలా చూసుకుంటానని, దత్తత తీసుకోడానికి ఒప్పుకోమని ప్రాధేయపడ్డాను. నాకూ పిల్లలులేరు బాబు, ఈ వయసులోనైనా ఆ భగవంతుడు కరుణించాడనుకుంటాను. అని ఒప్పుకుంది. వెంటనే నా భార్యకు చెప్పాను ఆమె సంతోషం వ్యక్తం చేసింది. స్నేహితులకు కూడా ఫోన్ చేసి చెప్పాను. ఎంతో ఉత్సాహంతో ఇంటికి వచ్చాను. అమ్మ ఉన్న గదికి వెళ్ళాను, అంతా శుభ్రం చేశాను. నాకు తెలిసిన తాపీ పని వాళ్ళను పిలిచి ఇల్లంతా ఉన్న చిన్న చిన్న రిపేర్లు చేయించాను. రంగులు కూడా వేయించాను. అమ్మ గదికి ఏ.సి పెట్టించాను.
ఆఫీస్ లో వసుంధర గారిని దత్తత తీసుకుంటున్నానని, ఆమెను నాకన్న తల్లిలా చూసుకోబోతున్నాని చెప్పాను. ఆరోజు అందరికీ భోజనాలు ఏర్పాటుచేస్తున్నాను తప్పకుండా ఇంటికి రావాలని ఆహ్వానించాను. నా వెనుక కొంతమంది గుసగుసగా మాట్లాడుకున్నారు అదేంటి రేపో మాపో చావబోయే ముసలిదాన్ని దత్తత తీసుకుంటున్నాడు, ఏమైనా పిచ్చా, ఓ అనాధ బాలుడ్ని దత్తత తీసుకుని చదివిస్తే పెద్దవాడయ్యాక కట్నం వస్తుంది. డబ్బుంటే సరిపోతుందా, అనుభవించే ఇది లేదు, నేనైతేనా రోజుకో అమ్మాయితో... అన్నాడు ఈ మధ్యే కొత్తగా చేరిన ఓ కుర్రాడు.
అవన్నీ కూరలో కరివేపాకులా తీసి పారేసాను.
దత్తత తీసుకునే రోజు రానే వచ్చింది. అప్పటివరకు రోజులు క్షణాల్లా గడిచిపోయాయి నాకు. మనసెంతో ఉల్లాసంగా, అనందంగా ఉంది. ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా మారిపోయాను. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాను. భార్య చేత గడపకి పసుపు పూయించాను. పక్కింటి అమ్మాయిని బ్రతిమాలి ఇంటిముందు ముగ్గు వేయించాను. ప్రభాకర్ దత్తత స్వీకారానికి ముందు ఓ సభను ఏర్పాటు చేసాడు. అక్కడికి స్నేహితుల్ని, తెలిసిన వాళ్ళను పిలిచాను. ఇప్పటి వరకు అనాధల్ని, చిన్నపిల్లల్ని దత్తత తీసుకోడం మనం చూశాం. కానీ ఇలా వృద్దురాల్ని దత్తత తీసుకోవడం మొదటిసారి చూస్తున్నాం.
ఈయనకి ఉన్న ఈ గొప్ప మనసు భగవంతుడు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని నన్ను ఆకాశానికి ఎత్తేస్తూ, ములగ చెట్టు ఎక్కించే ప్రయత్నం చేసాడు. నేను అవేమి పట్టించుకోకుండా ఆగస్టు పదిహేను రోజు ఎప్పుడెప్పుడు జెండా ఎగరేస్తారా, చాక్లెట్లు ఎప్పుడెప్పుడు పంచుతారా అన్నట్లుగా స్కూలు పిల్లాడు ఎదురు చూసినట్టుగా దత్తత కార్యక్రమం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా ఎపుడు వసుంధర గారిని ఇంటికి తీసుకెల్దామా అని ఎదురుచూస్తున్నాను.
కార్యక్రమం పూర్తయ్యింది వసుంధర గారిని ఇంటికి తీసుకెళ్ళాను. అమ్మా... అని పిలిచాను. ఎందుకో తెలుగు భాషలో అంతకన్నా మధురమైన పదం లేదనిపించింది. మళ్ళీ అమ్మ దొరికినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకున్నాను. అమ్మకి తనగది చూపించాను, ఆ గది తనదే అని ఆగది లోని వస్తువులన్నీ తననే వాడుకోమని చెప్పాను, ఆమె సంతోషిoచింది.
అమ్మకు ఏమి ఇష్టమో అడిగి తెలుసుకుని భోజనాలు ఏర్పాటు చేశాను. సాయంత్రం ఆఫీస్ స్నేహితులు కొంతమంది వచ్చి తినేసి వెళ్లిపోయారు. నేను నా కుటుంబం అమ్మతో కలిసి భోజనం చేశాo. అమ్మవడిలో తల పెట్టుకుని పడుకున్నాను. గాఢంగా నిద్ర పట్టింది. నన్నుఆలా పడుకోబెట్టి ఎప్పుడు లేచి వెళ్లిందో తెలియదు. చాలా రోజుల తర్వాత ఎంతో ప్రశాంతంగా నిద్ర పోయాను.
తెల్లవారింది. ఆఫీస్ నుండి ఉమేష్ ఫోన్ చేసాడు. అపార్టుమెంట్ డిజైన్ బ్లూ ప్రింట్ బిల్డర్ త్వరగా పూర్తిచేసి ఇవ్వమన్నాడని వెంటనే ఆఫీస్ కి రమ్మని. నేను హడావిడిగా ఆఫీస్ కి బయల్దేరాను. ఎక్కడికి బాబు అడిగింది అమ్మ. ఆఫీస్ కి వెళుతున్నానమ్మా చెప్పాను గుమ్మo దగ్గరికి వెళ్తూ. టిఫిన్ చేసి వెళ్ళు అంది. టైం లేదమ్మా వచ్చాక తింటాను అన్నాను. ఒక్క నిమిషం బాబు అని గబగబా రెండు ఇడ్లి, కొబ్బరి చట్నీ ప్లేట్ లో పెట్టుకుని నా దగ్గరికి వచ్చి తిను బాబు అని గోరు ముద్దలు తినిపించింది. గబ గబా తినేసి నీళ్లు తాగి బయల్దేరాను. తిన్నది రెండు ఇడ్లియే ఐనా నాకడుపు నిండిపోయింది. సంతోషంతో నా మనసు ఉప్పొంగిపోయింది.
ముల్కనూరు ప్రజా గ్రంధాలయం మరియు నమస్తే తెలంగాణా దిన పత్రిక సంయుక్తంగా నిర్వహించిన 2025 కథల పోటీలో 3000 రూపాయల బహుమతి పొందిన కథ.
మరియు
నమస్తే తెలంగాణా దిన పత్రిక ఆదివారం ప్రత్యేక అనుబంధం బతుకమ్మ లో 01-03-2026 న ప్రచురించబడింది.