మృత్యుంజయుడు

This is a family story by Virinchi (Tallapragada Gopalakrishnamurty. “మిగతా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ గానే ఉన్నాయి...ఒక్క పి.యస్.ఏ తప్ప.అలా అని అనుమానించలేం.మీకు బయాప్సీ తీస్తే గానీ ఏ విషయం నిర్ధారించలేం” అన్నారాయన.

మృత్యుంజయుడు

మృత్యుంజయుడు

విరించి

(తలాప్రగడ గోపాలకృష్ణ )

 

 

          ఏమయ్యిందిరా నీకు... ఈమధ్య చాలా డల్ గా ఉంటున్నావ్?” అన్నాడు బలరామయ్య కొడుకు సుధాకర్ ఆఫీస్ నుండి నీరసంగా రావడం చూసి.

           ఏం లేదు నాన్న!  ఆఫీస్ లో పని ఒత్తిడిఅన్నాడు సుధాకర్ షూస్ విప్పుకుంటూ.

               "గీజర్ ఆన్ చేసాను.స్నానం చేసి రండి.వేడి వేడి పకోడీలు వేసాను.తిందురుగానీ" అంది జానకి మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ.

            గ్లాసందుకుని నీళ్ళు గడ గడా త్రాగేసాడు.

            పిల్లలేరి?” అన్నాడు.

         కాస్యప్ ఎంసెట్ కోచింగ్ కి వెళ్ళాడు, శ్రావ్య రూం లో చదువుకుంటోంది అంది జానకి.

             సుధాకర్ బెడ్ రూం లోకి వెళ్ళి  డ్రెస్ మార్చుకుని, స్నానం చేసి పది నిముషాల్లో హాల్లోకి వచ్చాడు.బలరామయ్య టి.వి లో వార్తలు చూస్తున్నాడు. భార్య కేన్సర్ తో  పోయినప్పటినుండి ఆయన టి.వి తోనే కాలక్షేపం చేస్తున్నాడు.బయటకు వెళ్ళడం కూడా తగ్గించాడు.

              జానకి పకోడీలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది.

              కాస్త సూట్ కేస్ లో బట్టలు సర్దు.రేపు గౌతమీకి హైదరాబాదు వెళ్ళాలి అన్నాడు జానకితో సుధాకర్.

            ఎందుకట? “  అంది జానకి.

             అర్జంటు ఆఫీస్ పని.రెండు మూడు రోజుల్లో వచ్చేస్తా అన్నాడు.

             సరే రేపటికి కదా!” అంది జానకి.

               కాసేపు తండ్రితో కబుర్లు చెప్పి,తొమ్మిదింటికలా భోజనం ముగించి పిల్లల గదిలోకి  జేరాడు సుధాకర్. శ్రావ్య  కాస్యప్ ప్రక్కన కూర్చుని కబుర్లు చెప్తున్న సుధాకర్ ఆలోచనలు పరి పరి విధాల పోతున్నాయి.అన్యమనస్కంగానే ఉన్నాడు.తలపోటుగా ఉందని పిల్లలకిగుడ్ నైట్ చెప్పి పడక గదిలోకివచ్చి నడుము వాల్చాడు.

            ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు.ఆరోజు సంఘటనలు ఒకటొకటిగ గుర్తుకు వచ్చి భయపెడుతున్నాయి.

            దేన్నయినా ధైర్యంగా ఎదుర్కొనే తను,ప్రతీవాడికి ధైర్యం చెప్పే తను ఎందుకంత భయపడుతున్నాడో తనకే అర్ధం కావటం లేదు.మిత్రుడు, డాక్టరు అయిన బాలాజీ సలహా ప్రకారం తను గత కొన్ని సంవత్సరాలుగా ఎడాదికోసారి రొటీన్ గా రక్తపరీక్షలు చేయించుకుంటూనేఉన్నాడు.’వయస్సు నలభై అయిదు దాటాక కొన్ని పరీక్షలు చేయించుకుంటేనే మంచిది.అందులో ప్రోస్టేట్ స్పెసిపిక్ ఏంటెజెన్ ముఖ్యమైనది.ఏదైనా ఉంటే ప్రాధమిక స్థాయి నుంచే జాగ్రత్త పడొపచ్చు అని చెప్పాడు బాలాజీ.

           .పి.యస్. పరీక్ష రిపోర్ట్ ఈరోజే వచ్చింది.ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువుందని ఓసారి హైదరాబాద్ వెళ్ళి  యూరాలజిస్ట్ ని కలువు అని బాలాజీ చెప్పినప్పటినుండి మనస్సు కీడుని శంకిస్తోంది.

           వెళ్తే అక్కడి డాక్టర్ ఏమంటారో?...ఒకవేళ ప్రమాదకరమైన రోగమైతే భార్య,పిల్లలు, వృద్ధుడైన తండ్రి అనాధలయిపోతారేమో.తన తల్లి లాగే తనకీ రాసి పెట్టి ఉందేమో.సుధాకర్ ని ఆలోచనలు భయపెడుతున్నాయి.

            ఏమయ్యింది ? ఎందుకలా నిద్రలో ఉలిక్కి పడుతున్నారు?” అని భార్య అన్నా సుధాకర్ నోరు విప్పలేకపోతున్నాడు.

           మర్నాడు సాయంత్రం బట్టలు సర్దిన సూట్ కేస్ అందించింది జానకి. తండ్రికి, భార్యకి వెళ్ళొస్తానని చెప్పి,పిల్లలిద్దర్నీ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని,  రైల్వేస్టేషన్ కి ఆటో ఎక్కాడు.స్టేషన్ కి వచ్చిన పది నిముషాల్లోనే గౌతమీ వచ్చింది.గౌతమీ ఎక్కి బెర్త్ పై నడుము వాల్చినా కలతనిద్రలో అన్నీ పీడ కలలే.ఉదయాన్నే సికిందరాబాద్ లో దిగి, చెల్లెలు సుభద్ర ఇంటికి వెళ్ళాడు.కాలకృత్యాలు తీర్చుకుని,మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని జూబ్లి హిల్స్ లోని పెద్ద కారొరేట్ హాస్పటల్ కి వెళ్ళాడు.

                   యూరాలజిస్ట్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యంగారి అపాయింట్ మెంట్ తీసుకున్నాడు.అరగంట తర్వాత పిలిస్తే రూం లోకి వెళ్ళి నమస్కారం పెట్టి తన రిపోర్ట్స్ చూపించాడు.

               మిగతా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ గానే ఉన్నాయి...ఒక్క పి.యస్. తప్ప.అలా అని అనుమానించలేం.మీకు బయాప్సీ తీస్తే గానీ విషయం నిర్ధారించలేం అన్నారాయన.

                ఎంతవుతుంది సార్?”అన్నాడు సుధాకర్.

                 ఇరవై వెల దాకా అవుతుందిఅన్నారు డాక్టర్.

                సుధాకర్ కి ఏం చేయాలో అర్ధం కాలేదు.’బయాప్సీ తీయించుకోకపోతే రోగ నిర్ధారణ కాదు.నిర్లక్షం చేస్తే ముదిరిపోవచ్చు.తన సేవింగ్స్ ఎకౌట్ లో ముప్పైవేలు దాకా ఉన్నాయి.అవి వాడేస్తే..’.సుధాకర్ బయాప్సీ చెయించుకోవడానికే నిర్ణయించుకున్నాడు.

               .కే సర్ ఏరోజు చేస్తారు ?” అన్నాడు.

                 రేపు ఉదయం రండి.రిపోర్ట్ రావడానికి రెండు మూడు రోజులు పడుతుంది అన్నారాయన.

                 సరే సర్ అని నమస్కారం పెట్టి,ఆయన రాసిన చీటీతో కౌంటర్ లో డబ్బు  కట్టి బయటికి వచ్చాడు.సిటీలో ఇద్దరు మిత్రులుంటే కలుసుకుని రాత్రికి చెల్లెలు సుభద్ర ఇంటికి చేరాడు.

                అన్నం తిన బుద్ధి కాలేదు.ఏదో అయ్యిందనిపించి వాళ్ళకి అనుమానం రాకుండ మొహాంకి నవ్వు పులుకుని పదవగానే మంచం ఎక్కాడు.

                 రాత్రంతా భయంకరమైన ఆలోచన్లతో జాగరణే.

                 మర్నాడు డాక్టర్ చెప్పిన విధంగా బయాప్సీ హాజరయ్యాడు.ఏమాత్రం బాధ లేకుండా బయాప్సీ చేసిన డాక్టర్ కి ధన్యవాదాలు చెప్పాడు.

                 మీరు ఎల్లుండి సాయంత్రం రండి.అపటికి రిపోర్ట్ రావచ్చు అన్నారు డాక్టర్.ఆయనకు నమస్కారం పెట్టి బయటపడ్డాడు.

                ఆఫీస్ పని అవలేదు జానకీ! మరో రెండు రోజులు పట్టేతట్లుంది అని జానకికి ఫొన్ చెసి చెప్పాడు సుధాకర్.

               మూడో రోజు సాయంత్రం రిపోర్ట్స్ తో డాక్టర్ ని కలిసాడు.

               మిస్టర్ సుధాకర్! నథింగ్ టు వర్రీ.వెరీ ఎర్లీ స్టేజ్ అన్నారు డాక్టర్.

              సర్ అంటే...అంటే అన్నాడు సుధాకర్ గుండె దిటవు చేసుకుని.

              పోజిటివ్ వచ్చింది.దీనికి రోబోటిక్ సర్జరీ చేయాలి.నాలుగు లక్షలవుతుంది.మూడు రోజులు హాస్పటల్ లో ఉండాలి.మూడు వారాలు డయిపర్స్ వాడాలి.మరో ముడు నెలలు మందులు వాడాలి అన్నారాయన.

              సుధాకర్ కి నోట మాట లేదు.రిపోర్ట్ పోజిటివ్ వచ్చిందంటే ...’తనకు ...తనకు...’ పదం తలుచుకోడాంకే సుధాకర్ కు ధైర్యంచాలడం లేదు.తన తల్లి వ్యాధి ముదిరిపోయే మరణించింది.తనకేదైనా జరిగితే తన కుటుంబం అంతా అనాధలై రోడ్డున పడతారనే ఊహే భయంకరంగా ఉంది.

            ఏమంటారు?”అన్నారు డాక్టర్.

            సర్ రిపోర్ట్   కరక్టేనా సర్? ఎక్కడైనా పొరబాటు జరిగిందేమో సర్ అన్నాడు సుధాకర్ చిన్న ఆశతో...గుండె దడ దడ లాడుతుంటే.

            రిపోర్ట్ లో తేడా ఉండదు.మీరెందుకు భయపడుతున్నారు?మగవాళ్ళలో ఇది చాలా కామన్.మీకు తెలుసా! తొంభై యేళ్ళు దాటిన మగవాళ్ళలో నూటికి తొంభై మందికి ప్రోస్టేట్ కేన్సర్ ఉంటుంది.ఆనీ వారికితెలియదు.సో... నథింగ్ టు వర్రీ" ధైర్యం చెప్పారు డాక్టర్.

                 సుధాకర్ కు నిస్సత్తువ ఆవరించింది.

             సర్ నేను డబ్బు చూసుకుని వస్తాను సర్!” అన్నాడు రిపోర్ట్స్ తీసుకుని లేచి నుంచున్నాడు.

              .కే.! .కే! మీ ఇష్టం,త్వరగా చెయ్యించుకుంటే మంచిదిఅన్నారాయాన.

                నెమ్మదిగా రూంలోంచి బయటికి వచ్చడు.గుండె వేగంగా కొట్టుకుంటోది,వళ్ళంతా చెమటతో తడిసిపొతోంది.తల తిరుగుతున్నట్లుగా ఉంది.కాళ్ళు తడబడుతున్నాయి.అక్కడే బయట కుర్చీలో కుర్చున్నాడు.కర్చీఫ్ తో మొహం తుడుచుకున్నాడు.బాటిల్ మూత తీసి రెండు గుక్కలు నీళ్ళు త్రాగాడు.

                   వెంటనే మిత్రుడు బాలాజీకి ఫోన్ చేసాడు.

                బయాప్సీ పాజిటివ్ వచ్చింది కనుక అంకాలజిస్టు  చూడటం బెటర్ సిటీలో పెద్ద అంకాలజిస్ట్ మోహన కృష్ణ  నా ఫ్రెండ్.ఆయనకు ఫోన్ చేస్తాను.ఇప్పుడే ఆయన్ని కలువు అన్నాడు బాలాజీ.

                 డాక్టర్లు క్యాన్సరును తగ్గించడానికి అవసరమైన చికిత్స చేస్తారు. కాని నువ్వు క్యాన్సరుని జయిస్తావా? క్యాన్సర్ నిన్ను జయిస్తుందా అనేది నీ మానసిక స్థైర్యాన్ని బట్టి వుంటుంది. జీవితం చాలా విలువైనది. అంతటి విలువైన జీవితాన్ని పోరాటం చేయకుండా క్యాన్సరుకి సరెండర్ చేయకు.” అని అతని డాక్టర్ ఫ్రెండ్ చెప్పాడు.

               సరే అని చెప్పి క్యాంటీన్ కొచ్చి కాఫీ త్రాగాడు. పది నిముషాలు స్థిమితంగా కూర్చున్నాడు.ఆటో మాట్లాడుకుని మొహన కృష్ణ హాస్పిటల్ కు వచ్చాడు. హాస్పిటల్ లో ఆడా మగా చిన్నా పెద్ద అన్న బేధం లేకుండా రోగులతో కిక్కిరిసిపోయి ఉంది.

                వెయిటింగ్ హాల్లో కూర్చోడానికి కూడా జాగా లేదు.డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని మూల కూర్చున్నాడు.ఒక గంట...రెండు గంటలు గడిచింది.

               ప్రపంచంలో తన కొక్కడికే రోగం వచ్చిందని భయపడిన సుధాకర్ అంతమంది అదే రోగంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రావడం చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. 

                  చుట్టూ చూసాడు.తన కుడి ప్రక్క కూర్చున్న ముసలాయన్ని పలకరించాడు.అతడు అదే సమస్యతో ఐదు సంవత్సరాలు క్రతం ట్రీట్ మెంట్ తీసుకున్నాట్ట,అప్పట్నుంచి సంవత్సరానికోసారి చెకప్ కొస్తున్నాట్ట.ఐతే తను ఐదు సంవత్సరాలు బ్రతకచ్చన్నమాట.

              తన ఎడమ ప్రక్కన ఉర్చున్నామెను పలుకరించాడు.ఆమె బ్రస్ట్ కేన్సర్ కు పది సంవత్సరాల క్రితం ట్రీట్ మెంట్ తీసుకున్నానని,చెకప్ కొచ్చానని చెప్పింది.సుధాకర్ కు మరింత ధైర్యం వచ్చింది.

              ఎదురుగా పదేళ్ళ పాప...ఏం కేన్సరో తెలియదు.అమాయకంగా ఆడుకుంటోంది.డాక్టర్ మోహనకృష్ణ నుంచి పిలుపు రాగానే రిపొర్ట్స్ తో డాక్టర్ రూం లోకి వెళ్ళాడు.రిపోర్ట్స్ చూసిన ఆయన చిన్నగా నవ్వాడు.

               మీ కూడా ఎవరైనా వచ్చారాఅని అడిగాడు.

                లేదు సర్ అన్నాడు సుధాకర్.

                వస్తే మంచిది.కొంతమంది అవగాహన లేక భయపడుతూ ఉంటారు అందుకు

               పర్లేదు సర్ చెప్పండి

               నథింగ్ టు వర్రీ.ఎర్లీ స్టేజ్.ఒక్క ఫైవ్ సిట్టింగ్స్ సైబర్ నైఫ్ రేడియేషన్ తీసుకుంటే సరిపోతుంది.యు విల్ బి ఆల్ రైట్ అన్నారాయన.

              సర్ నాకు ప్రమాదం ఏమీ లేదు కదా!నాకు నిజంగా క్యూర్ అవుతుందా అన్నాడు సుధాకర్ సందేహిస్తూ.

               ఆయన చిరునవ్వు నవ్వాడు.

              మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి అన్నారాయన.ఆయనకి తెల్సే అడిగారు.

              బి పాజిటివ్ సర్ అన్నాడు సుధాకర్ అమాయకంగా.

            సో... మీ రక్తమే బి పాజిటివ్... యు బి పాజిటివ్ ఆల్వేస్.ధైర్యంగా ఎదుర్కుంటే సగం రోగం తగ్గిపోతుంది.మిగతా సగం మా వైద్యం తో తగ్గిపోతుంది.ఎప్పుడూ డాక్టర్ మీద,వైద్యం మీద నమ్మకంతో ఉండండి.రోగం గురించి అస్సలు ఆలోచించకండి.మీ దినచర్య నార్మల్ గా చేసుకోండి.ప్రతీ వాళ్ళతోటి రోగం గురించి చర్చించకండి.వాళ్ళకి అవగాహన లేక మిమ్మల్ని భయపెడతారు.భయపడేవాడు పోరాడలేడు.పోరాడలేని వాడు విజయం సాధించలేడు.ఎప్పుడు శత్రుతో పోరాడాలి.పోరాడితే పోయేదేముంది రోగం తప్ప అన్నారు డాక్టర్ నవ్వుతూ.

             ష్యూర్ సర్ అన్నాడు సుధాకర్ కుడా చిరునవ్వుతో. డాక్టర్ మాటలతో సుధాకర్ కు కొండంత ధైర్యం వచ్చింది.

            బెల్ కొట్టి  , సిస్టర్ రాగానే ఏం చెయ్యాలో చెప్పారు డాక్టర్. ఆమె బిల్ కౌంటర్ కు తీసుకెళ్ళింది.

             సైబర్ నైఫ్ ఐదు సిట్టింగ్స్ కు ఐదు లక్షలవుతుంది సర్!” అన్నాడు కౌంటర్ లో ఉన్న వ్యక్తి.

               సుధాకర్ గుండెల్లో ఒక్కసారి పెద్ద బండరాయి పడింది.

              కొడుకుని బిటెక్ లో జేర్చడానికి, కూతురు వివాహాంకి అని కడుపు మాడ్చుకుని, కోరికల్ని చంపుకుని పైసా పైసా కూడ బెట్టిన పది లక్షలు బ్యాంక్ లో ఫిక్సిడ్ లో ఉన్నాయి.ఒక్కసాగా ఐదు లక్షలు తీసేస్తే... వాళ్ళ భవిష్యత్ ఏమిటి?హెల్త్ ఇన్ స్యూరెన్స్  చేయించకేంత తప్పు చేసాడో ఇప్పుడర్ధమైంది.ఆఫీస్ లో  కూడా అంత సొమ్ము ఇవ్వరు.తనకు ఇంత ఖరీదైన రోగమని తెలిస్తే జానకి,పిల్లలు నాన్న ఎలా తట్టుకుంటారు? నాన్న గుండె ఆగి పోతుంది.జానకి కుప్పకూఇపోతుంది.పిల్లలు బెంబేలెత్తిపోతారు.సో... వాళ్ళకి చెప్పకూడదు.ఇప్పుడు తనేం చేయాలి?

               నీకే తెలియకుండా నీకెంత ఎక్కువ ధైర్యసాహసాలు వున్నాయో సాహసం చెయ్యడం తప్ప మరో మార్గం లేనప్పుడే నీకు తెలిసివస్తాయి” – అని ఎప్పుడో చదివిన కొటేషన్ గుర్తుచేసుకున్నాడు. క్యాన్సర్ నన్ను జయించి, నన్ను నా కుటుంబ సభ్యులకి దూరం చేయాలని చూస్తోంది. ఇది నేను సాహసం చేయవలసిన సమయం. నేను క్యాన్సర్ తో పోరాడతాను. సాహసంతో పొరాడి క్యాన్సర్ రక్కసి కోరలనుండి నా జీవితాన్ని తిరిగి తీసుకుంటాను. – అని ఆలోచించి ట్రీట్ మెంట్ తీసుకోడానికి బయల్దేరాడు.

                 తను లేని వాళ్ళ జీవితాన్ని ఊహించుకోవడానికే భయంగా ఉంది.వాళ్ళ కోసమైన తను బ్రతకాలి.బ్రతకాలంటే ఎంత ఖరీదైన వైద్యమైనా చేయించుకోవాలి.చేయించుకోవాలంటే బ్యాంక్ లో డబ్బులు తియ్యాలి.సుధాకర్ ఒక నిర్ణయానికి వచ్చాడు.

                రాత్రి బస్సులో ఇంటికొచ్చేసాడు. జరిగిన విషయాలేవీ ఇంట్లోగానీ,బయటగానీ ఎవ్వరికి చెప్పలేదు.బ్యాంక్ కి వెళ్ళి డిపోజిట్లు కేన్సిల్ చేసి తన ఎకౌంట్ లో వేయించుకునాడు.ఆఫీస్ కి వెళ్ళి మరో వారం రోజుల శెలవు పొడిగించుకున్నాడు.మళ్ళీ హైదరాబాద్ కు మర్నాటికి తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నాడు.

             ఇంటికొచ్చి తండ్రితోను,భార్య తోనూ మాములుగా కబుర్లు చెప్పాడు.పడుకునే ముందు జానకి తో అన్నాడు రేపు మళ్ళీ గౌతమీకి హైదరాబద్ వెళ్ళాలి.మొన్న వెళ్ళిన పని అవలేదు.ఈసారి ఐదు రోజులు పట్టచ్చు అని.

             అదేమిటండీ!ఈరోజేగా వచ్చారు.ఇంతకు ముందు ఎప్పుడో గానీ క్యాంపులు ఉండేవి కాదు.ఇప్పుడెమిటి?...మరీ ఐదు రోజులా? కాస్యప్ ను బిటెక్ లో జాయిన్ చెయ్యాలి.శ్రావ్యకు చదువయిపోతోంది... సంబంధాలు చూడాలనుకున్నాం కదా!ఇలా అస్తమానూ హైదరాబాద్ అంటే ఎలా అండీ?” అంది జానకి అయిష్టంగా.

          తప్పదు జానకీ!మన అందరి కోసం కష్టపడక తప్పదు అన్నాడు.

           ఎవ్వరూ తన కోసం బాధ పడటం ఇష్టం లేదు.తనే  ధైర్యంగా ఎదుర్కోవాలి.తను బ్రతికుంటే అందరి సమస్యలు పరిష్కరించవచ్చు. మరో పాతిక లక్షలు సంపాదించవచ్చు.తనే లేకపోతే పది లక్షలు వాళ్ళని రక్షించ లేవు.’

            మర్నాడు గౌతమీకి బయల్దేరి హైదరాబాద్ వచ్చి హోటల్ లో దిగాడు.

             హాస్పిటల్ లో ఐదు లక్షలు కట్టి సైబర్ నైఫ్ రేడియేషన్ చికిత్స ప్రారంభించాడు.ఐదు రోజులు రేడియేషన్ పూర్తి అయ్యింది.రోజుకు పది నిముషాలు చొప్పున రేడియేషన్...ఏవిధమైన బాధ లేదు.శాస్త్ర,సాంకేతికత ఎంత అభివృద్ధి చెందిందని ఆశ్చర్యపోయాడు సుధాకర్.

          మూడు నెలలకోసారి చెకప్ కి రమ్మని డాక్టర్ చెప్పారు.చికిత్స అయిపోయాక సుధాకర్ నార్మల్ గా డ్యూటీకి హాజరవుతున్నాడు.

          మూడోసారి హైదరాబాద్ చెకప్ కి వెళ్ళినప్పుడు రాత్రి హోటల్ లో  పడుకుని ఉండగా   జానకి నుండి ఫోన్ వచ్చింది.

         హల్లో! జానకీ !” అన్నాడు సెల్ ఆన్ చేసి.

         మీరు హోటల్ లో ఎందుకు దిగారు?మీ ప్రక్కన ఎవరున్నారు?” అంది జానికి సీరియస్ గా.

         అస్తమాను మా చెల్లెలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని?...ఆఫీస్ పని కదాని హోటల్లో దిగాను.నా ప్రక్కన ఎవరుంటారు?అదేం ప్రశ్న?” అన్నాడు సుధాకర్.

          అబద్దాలు  చెప్పకండి.మూడు నెలల కోసారి ఆఫీస్ పని అని నాతో చెప్పి శెలవు పెట్టి వెళ్తునారా లేదా?” అంది కోపంగా.

           గతుక్కుమన్నాడు సుధాకర్.

           ఎవరు చెప్పారు?”అన్నాడు ఏమనలో తెలియక.

            ఎవరు చెప్తే కరెక్టట? మధ్య అబద్దాలు కూడా నేర్చుకున్నారా? ఐదు లక్షలు ఎవతికిచ్చారు?నన్ను నా పిల్లల్ని గంగలో ముంచుతారు?”అంది బాధ మిళితమైన స్వరంతో.

            జానికీ ఏం మాట్లాడుతున్నావు?” అన్నాడు సుధాకర్ బాధగా.

            నాకంతా తెల్సండీ!మీ ఆఫీస్ లో పని చేసే మూర్తిగారు మీ ఆఫీస్ తాళాల కోసం మనింటికి వచ్చినప్పుడు చెప్పారు...’మీరు తరుచు శెలవు పెడ్తున్నారని.. .ఆఫీస్ పని కాదని.బ్యాంక్ లో పనిచేసే మా అక్క కొడుకు రవి మీరు ఐదు లక్షలు తీసుకెళ్ళారని చెప్పాడు.ఒక్కసారి అంత మొత్తం డ్రా చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది?” అంటూ ఏడుపు ప్రారంభించింది.

               జానకీ నా మాటలు నమ్ము.నేను వచ్చాక అన్ని విషయాలు చెబుతాను.నేనేం చేసినా మీ కోసమే చేస్తాను.బి పోజిటివ్.ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తావు.నన్ను నమ్మకపోతే ఎవర్ని నమ్ముతావు?”అన్నాడు సుధాకర్ జానకిని సముదాయి స్తూ.

              మీరు ఎందుకు అస్తమానూ హైదరాబద్ వెళ్తున్నారో?, ఐదు లక్షలుఎవతికిచ్చారో ? చెబితేగానీ పచ్చి మంచినీళ్ళు ముట్టను అని సెల్ డిస్ కనెక్ట్ చేసింది.

             సుధాకర్ తలపట్టుకున్నాడు.’ఇక చెప్పక తప్పని పరిస్థితి.ఎవరికోసమైతే తాను శారీరకంగా,మానసికంగా,ఆర్ధికంగా కష్టపడుతున్నడొ వాళ్ళే తనని అపార్ధం చేసుకుంటే తను చేయగలిగేదేముంది?’

            ఉదయాన్నే డాక్టర్ దగ్గరకు క్వార్టర్లీ చెకప్ కు వెళ్ళాడు.

           వెరీ గుడ్ సుధాకర్ గారు.మీరు జయించారు.మా ట్రీట్ మెంట్ కి మీ ధైర్యం తోడవడంతో బాగా క్యూర్ అయ్యింది.మీ పాజిటివ్ దృక్పధమే మీకు రక్ష.ఇక నుంచి  ఆరు నెలలకు, తర్వాత సంవత్సరానికోసారి చెకప్ కి రండి అన్నాడు డాక్టర్ మోహన కృష్ణ.ధంప్సప్ గుర్తు చూపిస్తూ.

            థాంక్యూ డాక్టర్ అన్నాడు సుదాకర్ ఆనందంగా.

              రాత్రే బయల్దేరి మర్నాడు ఉదయం ఇంటికి వచ్చాడు.సూట్ కేస్ బెడ్ రూం లో పెట్టి,బాత్ రూం కు స్నానానికి వెళ్ళాడు.పది నిముషాల్లో బాత్ రూం లోచి వచ్చేటప్పటికి సూట్ కేస్ తెరిచి,మెడికల్ రిపోర్ట్స్  అన్నీ మంచం మీద పరిచి ఉన్నయి.జానకి రిపోర్ట్స్ చదువుతూ కళ్ళు  తుడుచుకుంటోంది. సుధాకర్ జానికి ప్రక్క చేరి తల నిమిరాడు.

           నన్ను క్షమించండి.మీరెంత మానసికంగా నలిగిపోయారో,శారీరకంగా కష్టపడ్డారో గ్రహించలేకపోయాను.   ఎందుకింత సాహసం చెసారు? ఒంటరి పోరాటం ఎందుకు చేసారు.? మేమంతా ఏమయిపోయాము?” అంది జానకి వెక్కి వెక్కి ఏడుస్తూ.

            నిజానికి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందే రోగం నయమయ్యేది.కానీ మా అమ్మ కేన్సర్  తో పోవడంతో నా విషయం చెప్తే మీరెవ్వరూ తట్టుకోలేరని భావించి ధైర్యం తో పోరాడటమే  కేన్సర్ కు దివ్యౌషదము అని గ్రహించాను,పోరాడాను.అందుకే జయించాను అన్నాడు సుధాకర్ జానకిని దగ్గర తీసుకుంటూ.

               జానకి తన మంగళసూత్రం కళ్ళకద్దుకుంది అతను జయించినందుకు.

 

.

---అయిపోయింది---

 

 

 

 

 

 

 

 

 

సెల్ : 9848789094; -మెయిల్ : tallapragadak@gmail.com