ఈ వారం కథ కమామీషు

ఈ వారం కథ కమామీషు - 24-06-2022

ఈ వారం కథ కమామీషు
కథా కమామీషు 24.06.2022
1. నీ పేరేంటో చెప్పు బేబీ:
అతడు తన బేబీ నామకరణ మహోత్సవం చాలా గ్రాండ్ గా చేద్దామనుకుని, పురోహితుడిని కూడా మాట్లాడుకున్నాడు. తన బేబీకి చక్కని పేరు పెట్టాలని ఆలోచిస్తున్న అతనికి అతని తాతయ్య బామ్మలు, తల్లిదండ్రులు, రక్తసంబంధీకులేకాక, ఆ ఫంక్షన్ కోసం ఇంటికొచ్చిన బంధువులంతా బేబీకి తమ పేరు పెట్టవద్దంటే తమ పేరు పెట్టవద్దని కరాఖండీగా చెప్పేశారు. చివరికి ఆఫీసులో అతని బాసు కూడా ఈ విషయమై అతడిని హెచ్చరించాడు. పుట్టక పుట్టక పుట్టిన తన బేబీకి చక్కగా పేరు పెడదామనుకుంటే ఇలా అందరూ తమవారి పేర్లు పెట్టవద్దంటూ అడ్డం తిరగటంతో అతడు చికాకు పడిపోయాడు. ఎందుకలా అందరూ అతనికి వ్యతిరేకంగా మాట్లాడారు? దీని వెనక గల కారణం ఏమిటి? బొరుసు చంద్రరావు స్మారక ఉగాది కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకున్న గండ్రకోట సూర్యనారాయణ శర్మ హాస్య కథ ‘నీ పేరేంటో చెప్పు బేబీ’ తప్పక చదవండి.
2. యతి :
ట్రెక్కింగులో ఆ నలుగురు యువకులూ అసాధారణ నిపుణులే. దేశంలోని వేర్వేరు ప్రదేశాలలో ఉండే ఆ నలుగురికీ కుటుంబ అవసరాలకోసం డబ్బు సంపాదన అత్యావశ్యకమైంది. అందుకుగాను వారు ఒక అజ్ఞాత వ్యక్తి చెప్పిన ఒక ప్రమాదకరమైన అసైన్మెంట్ ను ఒప్పుకోవాల్సివచ్చింది. రెండు యతులను తెచ్చి ఆ వ్యక్తికి అప్పగించటమే ఆ అసైన్మెంట్. యతి అనేది మనిషి, కోతి కలగలిసినట్లు భీకర ఆకారంలో మంచుమనిషి అనీ, హిమాలయ పర్వత ప్రాంతాలలో మాత్రమే ఈ యతులు నివసిస్తాయనీ వారికి తెలుసు. అందుకే యతులను తీసుకురావటానికి ఆ నలుగురూ హిమాలయపర్వత ప్రాంతానికి బయలుదేరారు. భయంకరమైన చలిలో కత్తులతో కోస్తున్నట్లుగా వీచే మంచుగాలులకు, తుపానులకు తట్టుకుని ఎలాగైతేనేం రెండు యతులను వారు కనిపెట్టగలిగారు. ఆపైన వారేం చేశారు? ఆ రెండు యతులను బంధించారా? తమకిచ్చిన ఆ అసైన్మెంట్ పూర్తిచేశారా? కొసమెరుపు కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన శ్రీసుధామయి అత్యంత సాహసోపేతమైన కథ ‘యతి’ తప్పక చదవండి.
3. పోలీస్ స్టోరీ :
ఆ ఊరికి కొత్తగా పోస్టింగ్ వచ్చిన యువ ఎస్సై, ఒక వ్యక్తి మిస్సింగ్ కేస్ దర్యాప్తులో భాగంగా సిటీలోకి వచ్చిపోయే వాహనాలు చెకింగ్ చేయటం మొదలుపెట్టాడు. ఒక్కో వాహనాన్ని చెక్ చేస్తున్న ఆ ఎస్సైకి, ఒక కారు వెనుక సీట్లో ఒక వ్యక్తి పడుకుని ఉండటం కనిపించింది. అతని విషయమై విచారిస్తే, అతడు తన తమ్ముడనీ, బాగా తాగి పడుకున్నాడనీ ఆ కార్ డ్రైవర్ చెప్పటంతో సరేనంటూ, కారు పేపర్లన్నీ చెక్ చేసి, అన్నీ సవ్యంగా ఉండటంతో అతన్ని వెళ్లిపొమ్మన్నాడు. తర్వాత కానిస్టేబుల్ తో మాట్లాడుతూ పోలీసింగ్ అంటే ఏమిటో చెప్తూ, తాను వెళ్ళమన్న ఆ కారును మళ్ళీ ఆపించాడు. ఆ కార్ ఎందుకు ఆపించాడు? అందులో ఏముంది? గొర్లి శ్రీనివాసరావు ఉత్కంఠ కలిగించే క్రైమ్ కథ ‘పోలీస్ స్టోరీ’ తప్పక చదవండి.
4. పున్నమి రేడు :
పున్నమి వెన్నెల వస్తే చాలు ఆమె పరవశించిపోతుంది. ఆ పండు వెన్నెలలో తన జీవితేశ్వరునితో ఎన్నెన్నో అనుభూతులను పంచుకోవాలని ఆమె ఆరాటపడింది. కానీ ఆయుర్వేద వైద్యుడైన ఆమె భర్త ప్రతి పున్నమి రాత్రీ తన భార్య ఊసు పట్టించుకోకుండా, ఎకరం భూమిలో తాను పెంచుతున్న ఆయుర్వేద మొక్కల మధ్య తిరుగుతూ, ఒక్కో మొక్కనీ పలకరిస్తుంటాడు. మిగిలిన రోజుల్లో కూడా రాత్రిళ్ళు అతడు ఆ మొక్కల గురించే ఉత్సాహంగా మాట్లాడుతుంటే ఆమె ఓపికగా వినేది. అయితే ‘ఆ అందమయిన వెన్నెల రాత్రులను తాము ప్రియసంభాషణలతో, ప్రణయ సన్నివేశాలతో ఎప్పుడు నింపుకుంటామా’ అని ఆమె విరహతాపంతో ఎదురుచూసేది. అతనిలో మార్పు తీసుకురావటానికి ఆమె చివరికి ఏం చేసింది? అతనిలో మార్పు వచ్చిందా? పసుపులేటి సత్య శ్రీనివాస్ రచించిన రసరమ్య ప్రణయ గాథ ‘పున్నమి రేడు’ చదవండి.
5. ఫ్యాన్సీ నంబర్ :
అతడు మోజుపడి తన ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ కు ఒక ఫ్యాన్సీ నంబర్ని తీసుకున్నాడు. ఆ నంబర్ని చూసిన అతడి స్నేహితుడు ఆ నంబర్ చాలా బాగుందనీ, తను కొత్తగా పెట్టిన బిజినెస్ అభివృద్ధి చెందటం కోసం వాడుకుంటానని బ్రతిమాలటంతో అతడు ఒప్పుకున్నాడు. ఇక ఆరోజునుంచి అతడికి ఫోన్ల మీద ఫోన్లు రావటం మొదలుపెట్టాయి. ఆ రాంగ్ కాల్స్ అతడికి నిద్ర లేకుండా చేశాయి. దానికి తోడు అతని స్నేహితుడు వారపత్రికలు, ఆడియో రికార్డింగ్ షాపు, రెస్టారెంట్, క్యాటరింగ్, టైలరింగ్ అంటూ రకరకాల వ్యాపారాలు మారుస్తూ ఉండటంతో అతడికి ఆ స్నేహితుడి బిజినెస్ తాలూకు కష్టమర్లు ఫోన్లో ఇతడిని సతాయించటం మొదలుపెట్టారు. చివరికి అతడు తన స్నేహితుడి బెడద ఎలా వదిలించుకున్నాడు? ఆ ఫ్యాన్సీ నంబర్ చివరికి ఏమైంది? బుద్ధవరపు కామేశ్వరరావు రచించిన ఫన్నీ స్టోరీ ‘ఫ్యాన్సీ నంబర్’ తప్పక చదవండి.
6. అందరూ అనుమానితులే :
ఆ దంపతులు ఊరికి వెళ్ళి వచ్చేసరికి, ఇంట్లో ఉన్న వారి కూతురు మృతురాలై పడి ఉంది. పక్కనే నిద్రమాత్రల సీసా పడి ఉండటంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని అనుకున్నారు. కానీ పోలీసులు వచ్చి ఆమెది ఆత్మహత్య కాదనీ, ఎవరో ఆమె గొంతు నులిమి హత్య చేశారనీ చెప్పటంతో ఆ దంపతులు హతాశులయ్యారు. గత కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్న ఒక యువకుడు, ఆమెకు పెళ్లి సంబధం కుదిరిందని తెలిసి, వచ్చి వెళ్లాడని వాచ్ మెన్ చెప్పటంతో, ఆ యువకుడిపై అనుమానం బలపడింది. ఆఫీసులో ఆమె కొలీగ్ కూడా ఆమెతో చాలా గొడవ పడిందని తెలిసి, ఆమెను కూడా అనుమానించారు. అయితే ఆమె సెల్ ఫోన్లో వాట్సాప్ చాట్ చూశాక హత్య చేసిందెవరో పోలీసులకు తెలిసిపోయింది. ఇంతకూ ఆమెను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? డి.వి.డి. ప్రసాద్ క్రైమ్ కథ ‘అందరూ అనుమానితులే’ లో ఈవారం సహరిలో చదవండి.
Like
Comment
Share

0